సుబేదారి, ఆగస్టు30 : ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. బాధితుల ఫిర్యాదులు, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఖిల్లా వరంగల్ తహసీల్దార్ బండి నాగే శ్వర్రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు చేశారు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యంలో బృందాలు కాజీపేటలోని చైతన్యపురిలోని నాగేశ్వర్రావు నివాసంతో పాటుగా ఖమ్మం, కొనిజర్ల, చింతగాని, బొనకల్, ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న ఖిల్లావరంగల్ తహసీల్దార్ కార్యా లయంలో ఏడు చోట్ల సోదాలు నిర్వహించారు.
రూ. 1.15 కోట్ల విలువ చేసే ఇంటి ఆస్తులు, 1.43 కోట్ల 17 ఎకరాల భూమి, 23.84 లక్షల గోల్డ్, రూ. 92వేల విలువైన వెండి అభరణాలు, రూ. 34 లక్షల విలువైన నాలుగు కార్లు, రెండు బైక్‌లు, 23 చేతి గడియారాలు, రూ. 16 లక్షల విలువ చేసే గృహోపకరణాలు మొత్తంగా రూ. 5,2,25,198 ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. రూ. 30వేల నగదు దొరికింది. వీటన్నింటిని సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయటి మార్కెట్లో నాగేశ్వర్రావు ఆస్తుల విలువ వంద కోట్లపైనే ఉంటుందని తెలుస్తున్నది. నాగేశ్వర్రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో రెవెన్యూ శాఖలో కలకలం రేపింది.
నాగేశ్వర్రావు కాజీపేట, ధర్మసాగర్, హసన్‌పర్తి, కమలాపూర్ మండలాల్లో పనిచేసినపుడు భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితులను ఇబ్బందులకు గురి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. చాలా మంది ఆధారాలతో ఆయనపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.