ఎల్కతుర్తి : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు మహమ్మద్ సలీంపాషా (24) శనివారం ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహమ్మద్ చోటేమియాకు నలుగురు కుమారులుండగా, ఇందులో దివ్యాంగుడైన మూడో కొడుకు సలీంపాషా శనివారం కాకతీయ కెనాల్ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కెనాల్లో జారిపడి గల్లంతయ్యాడు. సలీంపాషా ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి తన మిగతా కుమారులకు విషయం తెలుపగా వారు కెనాల్ వద్దకు వెళ్లి చూడగా చెప్పులు, నిక్కరు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వగా, ఎస్సై తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని సలీంపాషా ఆచూకీ కోసం కెనాల్ వెంట రాత్రి వరకు వెతికినప్పటికీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడి ఆచూకీ లభించలేదు.