ములుగు, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : ములుగు పర్యాటక సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనున్నది. హైదరాబాద్లోని శిల్పారామం తరహాలో ఇంచర్ల వద్ద ఎకో ఎత్నిక్ విలేజ్ ఏర్పాటుకానున్నది. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ లక్ష్యంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ర్టాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ అసిస్టెంట్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (ఎస్ఏఎస్సీఐ) పథకం కింద రాష్ట్ర పర్యాటక శాఖకు రూ.37కోట్ల 10లక్షలు మంజూరు చేసింది.
రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల సూచన మేరకు ములుగు మండలం ఇంచర్ల శివారులో వెంకటాపూర్ మండలం జవహర్నగర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 163ని ఆనుకొని ఉన్న 20 ఎకరాలను ఇందుకు కేటాయించారు. ఇప్పటికే పర్యాటకులకు ములుగు జిల్లాలో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటుచేసిన అధికారులు ఎకో ఎత్నిక్ విలేజ్ పనులను సోమవారం ప్రారంభించనున్నారు.
శిల్పారామం తరహాలో..
హైదరాబాద్లోని శిల్పారామం తరహా స్టాల్స్, ఫుడ్ కోర్ట్లు, కాటేజీలు, హంపి థియేటర్, ఇతర సౌకర్యాలను ఈ ఎకో ఎత్నిక్ విలేజ్లో కల్పించనున్నారు. ఇవేగాక కులవృత్తులను ప్రోత్సహించేందుకు శిల్పారామం లో ఉన్న విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత చీరెలు, బొమ్మలు, పనిముట్లు, అల్లికలతో కూడిన ఉత్పత్తులు, మట్టితో చేసిన కుండలు, కప్పులు, పింగాని పాత్రల విక్రయాల కేంద్రాలను నెలకొల్పనున్నారు.
కులవృత్తిదారులకు ఎకో ఎత్నిక్ విలేజ్లో వసతి కల్పించడంతో పాటు తయారు చేసుకునేందుకు తయారీ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. 20 ఎకరాలలో పర్యాటకులకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు కులవృత్తిదారులకు ప్రోత్సాహం అందించేలా శిక్షణ కేంద్రాలు, తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలను, ఫుడ్ కోర్టులను, పిల్లలు, పర్యాటకులు సేదతీరేందుకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పించనున్నారు.