మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో భాగంగా హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో 176 పాఠశాలలు, వరంగల్ జిల్లాలో 223 పాఠశాలలను ఎంపిక చేసి వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగాప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించాలని ఆదేశించారు. గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, వరంగల్ కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, శ్రీవాత్సవ, డీఈవోలు వాసంతి, రంగయ్య నాయుడు పాల్గొన్నారు.
హనుమకొండ, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలులో భాగంగా హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద హనుమకొండ జిల్లాలో 176 పాఠశాలలను ఎంపిక చేశామని తెలిపారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో 645 పాఠశాలలకు 223 ఎంపికైనట్లు వివరించారు.
సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామం, పాఠశాలను ఎంపిక చేస్తామని చెప్పారు. ఆ పాఠశాలలో విద్యార్థుల నమోదు ఆధారంగా మొత్తం హనుకొండ, వరంగల్ జిల్లాలోని పాఠశాలల్లో మూడో వంతు పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించడంతో పాటు కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. వనరుల నిర్వహణ కమిటీ వేసి, నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక ఖాతాలు తెరువాలని చెప్పారు. పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు, దాతల, ఎన్ఆర్ఐల నుంచి నిధులు సేకరించాలని సూచించారు. గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి, గ్రామసభలు నిర్వహించాలని చెప్పారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు కోసం హనుకొండ, వరంగల్ ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. విద్య, వైద్యరంగాలు దేశంలో మొదటి స్థానంలో నిలుపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. రూ.7,800 కోట్లతో పాఠశాలలను ఆధునీకరించాలని సీఎం తలపెట్టారన్నారు. దాతలు ఇచ్చే నిధులను బట్టి ఆయా పాఠశాలలకు దాతల పేర్లు పెడుతామని వివరించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలకు ప్రతి రోజు రావడంతోపాటు సమయపాలన పాటించాలన్నారు. అలాగే, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇండ్లకి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నాణ్యమైన విద్య తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ పాఠశాలల స్థలాలకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కబ్జాకు గురవుతున్నదని ఫిర్యాదు రావడంతో పాఠశాలకు వెళ్తే భూ కబ్జాదారులు తనపై, ప్రధానోపాధ్యాయుడిపై కేసు పెట్టారన్నారు. బాసిత్‌నగర్ పాఠశాల, అదాలత్ డీఈవో కార్యాలయం వెనుక ఉన్న సుబేదారి ప్రభుత్వ పాఠశాలల స్థలాలకు రక్షణ కల్పించాలని మంత్రిని, కలెక్టర్‌ను కోరారు. అర్బన్ పరిధిలోని అంగన్వాడీ స్కూళ్లను ప్రభుత్వ పాఠశాలల్లోకి మార్చాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఈసీ పాఠక్ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలన్నారు. జయశంకర్ సార్ చదివిన పాఠశాలను కేయూలోకి మార్చాలని ప్రతిపాదించినా అలాగే మిగిలిపోయిందన్నారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి కరదీపికను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిష్కరించారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, వరంగల్ కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, శ్రీవాత్సవ, డీఈవోలు వాసంతి, రంగయ్య నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆశ వర్కర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని ఆశ వరర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 693 మంది, హనుమకొండ జిల్లాలోని 616 మంది ఆశ వరర్లకు స్మార్ట్ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందన్నారు. మోదీ, యోగి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉందని గుర్తుచేశారు.