ఆర్యోగాన్నిచ్చే పాల కన్నా ఒంటిని, ఇంటిని గుల్ల చేసే మందుకు బానిసై తెగతాగేస్తున్నారు. ‘మద్యపానం హానికర’మని తెలిసినా కిక్కు కోసం లెక్కలేనన్ని పెగ్గులేస్తూ మత్తులో మునిగితేలుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజూవారీగా మద్యం విక్రయాల తీరు ఆందోళన కలిగిస్తున్నది. పాల వినియోగం వేల లీటర్లలో ఉంటే మద్యం సేల్స్ లక్షల లీటర్లు ఉండడం ప్రమాదకర సంకేతాలని స్తోంది. ఆదాయం కోసం కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్ల మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంటే.. అదే సమయంలో తాగునీటికి మాత్రం ఎప్పుడూ లేని విధంగా కొరత ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పలు వార్డుల్లో లెక్కకు మించి బెల్ట్‌షాపులతో మద్యం ఏరులై పారుతోంది. అడ్డూ అదుపు లేని మద్యం విక్రయాలు, విని యోగంతో ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఛిద్రమవడమే గాక కుటుంబతగాదాలు, ఘర్షణలకు దారితీసి శాంతిభద్రతలపై పెను ప్రభావం చూపుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో మద్యం మత్తులో జరిగిన దారుణాలు పెరుగగా, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరమున్నది.
వరంగల్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం కోసం అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ఆగం చేస్తున్నాయి. మద్యం(లిక్కర్, బీర్లు) అమ్మకాలు ఆందోళనకరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అధికార వైన్ షాపులు, బార్లతో పాటు ప్రతి ఊరిలోనూ సగటున పది వరకు బెల్ట్‌షాపులు ఉంటున్నాయి. అన్నిచోట్ల విచ్చలవిడి అమ్మకాలతో మద్యం వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్నది. మద్యం అలవాటుతో జనాల ఆరోగ్యం దెబ్బతింటున్నది. తాగుడు అలవాటుతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఆగమవుతున్నది. కూలీ చేసుకునే వారు సంపాదించే దానిలో సగానికిపైగా మద్యం ఖర్చులకే పోతున్నది. చిన్న ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిచోట మద్యం అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది దీనికి బానిసలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 294 వైన్‌షాపులు, 134 బార్లు ఉన్నాయి. లిక్కర్, బీర్లు కలిపి ప్రతి రోజు సగటున 2 లక్షల 27వేల 625 లీటర్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. లిక్కర్ 88వేల లీటర్లు, బీర్లు 1,39,625 లీటర్లు అమ్ముడుపోతున్నాయి. జూన్ నెల మొత్తం 27 లక్షల లీటర్ల లిక్కర్.. 43లక్షల 56వేల లీటర్ల బీర్లను వైన్ షాపులు, బార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకాలు జరిపింది.
వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఉంటాయి. ఆరు జిల్లాల్లో హనుమకొండ జిల్లాలోనే లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని మొత్తం మద్యం అమ్మకాల్లో 46 శాతం అమ్మకాలు హనుమకొండ జిల్లాలోనే జరుగుతాయి. హనుమకొండ జిల్లా పరిధిలో ఎక్కువగా నగర ప్రాంతం కావడంతో పాల వినియోగం ఇక్కడే ఎక్కువగా ఉంటున్నది. లిక్కర్, బీర్ల అమ్మకాలు ఇక్కడే అత్యధికంగా ఉంటున్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలో ప్రతిరోజు 79వేల లీటర్ల మద్యం అమ్మడుపోతున్నది. 30వేల 556 లీటర్ల లిక్కర్, 49వేల 680 లీటర్ల బీర్ల వినియోగమవుతున్నది.
మద్యం వినియోగం పెరుగుతుండడంతో సమాజంలోని చాలా అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. పేదల ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు శాంతిభద్రతల విషయంలో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన షాపులకు తోడుగా బెల్ట్‌షాపులు ఉండడంతో ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులో ఉంటున్నది. అర్ధరాత్రి కూడా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం వినియోగం పెరగడం వల్ల ఘర్షణలు, కుటుంబ పంచాయితీలు పెరుగుతున్నాయి. మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు ప్రధానంగా మద్యమే కారణమవుతున్నది.
పాలు నిత్యావసరం. పిల్లలు, పెద్దలు అందరు పాలు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం కోసం అనుసరించే విధానాలతో పాల కంటే అనేక రెట్లు మద్యం ఎక్కువగా అమ్మడుపోతున్నది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రతిరోజు సగటున 74వేల లీటర్ల పాల అమ్మకాలు జరుగుతున్నాయి. నగర ప్రాంతం ఎక్కువగా ఉన్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కలిపి 24వేల లీటర్ల పాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.
మహబూబాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : పాల కంటే మందే ఎక్కువ తాగుతున్నారని తేలింది. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉండగా వీరు సగటున 25 నుంచి 30వేల లీటర్ల పాలను వినియోగిస్తున్నారు. మద్యం మాత్రం జిల్లావ్యాప్తంగా సగటున 50వేల లీటర్ల వరకు విక్రయాలు జరుగుతున్నట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 60 వైన్స్, 20 బార్లతో పాటు ఒక్కో ఊరికి సుమారుగా పది చొప్పున సుమారు 6 వేలకు పైనే బెల్టు షాపులున్నాయి. జిల్లాలో తాగేందుకు మంచినీరు లేని పల్లెలు ఉన్నాయి కానీ బెల్టుషాపులు లేని ఊరు మాత్రం లేదంటే అతిశయోక్తి కాదు.
ములుగు, జూలై 8(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో రెండు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 29 మద్యం దుకాణాలు ప్రభుత్వ అనుమతులతో కొనసాగుతున్నాయి. ప్రతీ నెల జిల్లాలో రూ. 30 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రెండేళ్లకోసారి వచ్చే మేడారం మహాజాతర, మినీ జాతరలప్పుడు అదనం. ఏటా 25 శాతం మద్యం అమ్మకాలు పెరుగుతూ వ్యాపారులకు లాభసాటిగా మారుతున్నాయి. అధికారులకు సైతం మంచి గిట్టుబాటు అయ్యేలా మద్యం దందా కొనసాగుతున్నది.
జయశంకర్ భూపాలపల్లి, జూలై 8 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో నీటి సరఫరా సక్రమంగా లేకున్నా మద్యం మాత్రం ఏరులై పారుతోంది. భూపాలపల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19, కాటారం పరిధిలో 12 కలిపి మొత్తం 31 మద్యం షాపుల ద్వారా జూన్ నె లలో రూ.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు జిల్లాలో సుమారు రూ.83 లక్షల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా భూపాలపల్లి జిల్లాకేంద్రంలో రోజుకు 40వేల లీటర్లు, మిగతా మండలాల్లో సుమారు 30వేల లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.42 లక్షల విలువ చేసే 70వేల లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. పాలతో పోలిస్తే జిల్లాలో మద్యం విక్రయాలు డబుల్ జరుగుతున్నాయి. జిల్లాకేంద్రంలోని 3, 9, 10, 11, 13, 14, 20, 21, 23, 30వ వార్డుల్లో తాగునీటి సమస్య ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. కొన్ని వార్డుల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు లేక తాగునీరు అందడం లేదు. మరికొన్ని చోట్ల పావుగంట, అరగంటకు మించి నీరు రావడం లేదు. కానీ ఈ వార్డు ల్లో ఒక్కో చోట పది బెల్ట్ షాపులు ఉంటాయని, ఉదయం నుంచి రాత్రి వరకు మద్యానికి కొరత ఉండదని కాలనీవాసులే చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖకు భూపాలపల్లి మద్యం షాపులే అధిక ఆదాయాన్ని ఇస్తున్నాయి.