ములుగు, జనవరి23 (నమస్తేతెలంగాణ) : మేడారంపై కాలుష్యం పడగ విప్పుతోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర సందర్భంగా ముందస్తు మొక్కులతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే వాహనాల రాకపోకలతో పాటు వ్యర్థాలతో పొల్యూషన్ కోరల్లో చిక్కుకున్నది. మరో నాలుగు రోజుల్లో జాతర ప్రధాన ఘట్టం మొదలవుతుండగా కోట్లాది మంది రాకతో వాహన కాలుష్యంతో పాటు దుమ్మూ ధూళి, కట్టెల పొయ్యి పొగ భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించనున్నది.
సాధారణంగా పీల్చుకునే గాలి కంటే జాతర సమయంలో మూడు నుంచి ఐదు రెట్లు కలుషితం కానున్నది. ఇది చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, అస్తమా రోగులకు ప్రమాదకరంగా మారునున్నది. కట్టడి చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి పత్తా లేకుండా పోయింది. ఇప్పటికైనా కాలుష్యం పెరగకుండా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి సారించాలని భక్తులు
కోరుతున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం ప్రాంగణం నుంచి మేడారం వరకు దుమ్మూధూళితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడారం పార్కింగ్ ప్రాంతాలు అటవీ మార్గంతో పాటు ప్రస్తుతం మేడారంలో చేపట్టిన సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పక్కన సైడ్ బర్మ్లలో మట్టిని నింపి చదును చేయకపోవడంతో దుమ్మ లేస్తున్నది. జాతరకు వస్తున్న భక్తులు వంటా వార్పు చేయడంతో జాతర పరిసర ప్రాంతాలు ఇప్పటికే పొగతో కమ్ముకుపోయి అటు పొగ, ఇటు దుమ్ముతో భక్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపించే పరిస్థితులు కొనసాగుతున్నాయి. జాతరలో ప్రమాదకరమైన వాయు కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర పరిసర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది.
మేడారం మహా జాతరలో భాగంగా ముందస్తు మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య గత నెల రోజులుగా కొనసాగుతుండడంతో పరిసర ప్రాంతాలలో ప్రాణవాయువైన ఆక్సిజన్ ఇప్పటికే ఐదు రెట్లు కలుషితమైనట్లు తెలుస్తున్నది. దుమ్మూధూళి, పొగమంచుతో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. జాతరకు వారం రోజుల ముందు, జాతర జరిగే నాలుగు రోజులు, జాతర ముగిసిన వారం రోజులకు మూడు సార్లు గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్లారిటీ ఇండెక్స్ ఏక్యూఐ) 50 పీఎం లోపు ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు కాని 51నుంచి 400 ఏక్యూఐ ఉన్నట్లయితే చిన్న పిల్లలతో పాటు వృద్ధులకు శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.
401 కంటే ఎక్కువ ఏక్యూఐ ఉంటే ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. 2020, 2024 జాతరలలో గాలి నాణ్యత సూచిక 320పీఎం నుంచి 408 పీఎం వరకు నమోదైంది. సాధారణంగా కంటే గత రెండు జాతరలలో ప్రాణ వాయువు మూడు నుంచి ఐదు రెట్లు కలుషితమైనట్లు అధికారులు గుర్తించారు. గత జాతరల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని కట్టడి చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టనట్లు కనిపిస్తున్నది. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గట్టమ్మ గుడి నుంచి మొదలుకొని మేడారం మహా జాతర వరకు రోడ్ల వెంట కేవలం అవగాహన బ్యానర్లను ప్రదర్శించి చేతులు దులుపుకున్నట్లుగా తెలుస్తు న్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాల మేరకు కాలుష్యాన్ని నియం త్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుతున్నారు.