భీమదేవరపల్లి, జనవరి 5: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన నారుమడులకు రక్షణ చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల వ్యవసాయ అధికారి పద్మ రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని ముల్కనూరులో నారు మడులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యాసంగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన నారు పెరగకపోవడం, ఆకులు పసుపు- ఎరుపు రంగులోకి మారడం..కొన్నిసార్లు చనిపోతాయని తెలిపారు. అలా జరగకుండా సాయంత్రం వేళల్లో నారు మడి నుండి నీరు తీసివేసి పగటిపూట వెచ్చని నీటిని పెట్టాలని చెప్పారు.
జింక్ లోపం వలన ఆకులపై తుప్పుమచ్చలు ఏర్పడితే జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆరోగ్యంగా పెరగడానికి యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల carbendizam, మాంకో జబ్ మిశ్రమంగా మందులు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కాండం తొలచు పురుగు నుండి కాపాడుకోవడానికి కార్బోఫిరాన్ 3గ్రా గుళికలు, ఎకరా నారుమడికి ఒక కిలో చొప్పున చల్లాలని పేర్కొన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండి మంచుతో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుందని ఈ క్రమంలో అగ్గి తెగులు ఆశించకుండా రైతులు సరైన రక్షణ చర్యలు తీసుకొని జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కమలహాసన్, రైతులు పాల్గొన్నారు.