వరంగల్,జూలై 8 : స్మార్ట్ సిటీ లెక్కలు చెప్పాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా (ఏజీఐ ఆదేశించింది. పథకం ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా వివరాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజీఐ, బల్దియాకు నోటీసులిచ్చింది.
స్మార్ట్‌సిటీ పథకం నిధులకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్ట్‌లు, పూర్తియినవి, ఖర్చు చేసిన నిధుల వివరాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో అందజేయాలని హుకుం జారీచేసింది. తెలంగాణలో వరంగల్‌తో పాటు కరీంనగర్ స్మార్ట్‌సిటీ పథకంలో ఎంపిక కాగా ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్ వివరాలు ఏజీఐకి అందజేసింది. గ్రేటర్ వరంగల్‌కు సంబంధించిన లెక్కలు రాకపోవడంపై ఏఐజీ ఘాటుగా స్పందించడంతో రెండు రోజుల్లో పంపించే పనిలో బల్దియా అధికారులు నిమగ్నమయ్యారు.
స్మార్ట్‌సిటి పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్‌లో రూ. 937.81 కోట్ల అంచనాలతో 107 అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిలో రూ. 629.69 కోట్లు ఖర్చు చేశారు. అందులో రూ. 523.1 కోట్ల అంచనాలకు సంబంధించిన 67 అభివృద్ధి పనులను రూ. 506.38 కోట్లతో పూర్తి చేశారు.
రూ. 414.71 కోట్ల అంచనాలతో చేటట్టిన మరో 40 అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, వాటి కోసం ఇప్పటి వరకు రూ. 123.31 కోట్లు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే స్మార్ట్‌సిటీ పథకం ముగిసిన నాటి నుంచి ఏజీఐ అధికారులు లెక్కలపై నివేదిక పంపించాలని అనేక సార్లు లేఖలు రాసినా బల్దియా అధికారులు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీకి సంబంధించిన పూర్తిస్థాయి నిధులు గతంలోనే విడుదల చేసింది.