కరీమాబాద్, ఏప్రిల్ 23 : సినీరంగ ప్రముఖులు వరంగల్‌లో స్టూడియోను ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉర్సు రంగలీలా మైదానంలో ఆదివారం రాత్రి ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్‌తోనే వరంగల్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. వరంగల్ అంటేనే సక్సెస్‌కు చిరునామా అన్నారు. ఇటీవలే వరంగల్‌లో అనేక సినీ ఫంక్షన్లు జరిగాయని చెప్పారు. సినిమా విజయవంతం కావాలని, సినీ రంగానికి వరంగల్‌కు విడదీయలేని బంధం ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, దర్శకుడు సురేందర్‌రెడ్డి, హీరోహీరోయిన్లు అక్కినేని అఖిల్, సాక్షివైద్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఆదరిస్తారు : అక్కినేని నాగార్జున
మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. వరంగల్‌లో ప్రీరిలీజ్ చేశామంటే తప్పకుండా హిట్ అవుతుంది. మీ అభిమానం చూస్తుంటే తెలుస్తోంది. మీరంటే మాకు పిచ్చి. అభిమానులు, ప్రేక్షకులు ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి. ఇక నుంచి ప్రతి సినిమా కార్యక్రమాన్ని వరంగల్ నుంచే చేస్తాం. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.