Agastheswara Swamy Jatara | మరిపెడ : మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. మహమూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారులోని అగస్తేశ్వర స్వామి గుట్టపై స్వామివారి కల్యాణం అనంతరం మూడుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. జాతరకు మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ స్వామి వారిని మొక్కులు కోరుకుంటే నెరవేరుతాయని ప్రతితీ. త్రేతా యుగంలో అగస్త్య మహర్షి అఖండ భారత దేశ పర్యటన చేస్తున్న కాలంలో దక్షిణ దిశ వైపు ప్రయాణిస్తున్న సమయంలో మార్గమధ్యలో అబ్బాయిపాలెం గ్రామ శివారు కొండపైన శివలింగాన్ని ప్రతిష్టించారు.
అభిషేకం కోసం సృష్టించిన కోనేరుకు కాశీలో ఉన్న జీవనది గంగా ప్రవాహం నిత్యధార అని, కోనేటి గర్భంలో మహాశివుడు కొలువై ఉన్నాడని ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారికి పులిహోర, బెల్లం పానకం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందిస్తారు. జాతర సందర్భంగా అగస్తేశ్వర స్వామి గుట్టకు వచ్చే భక్తులకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుట్టపైన భక్తులకు మజ్జిగ, తాగునీటి అందజేశారు. మూడురోజుల పాటు జాతరకు వచ్చే భక్తులకు ఉచితంగా మజ్జిగ, మంచినీటిని అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాకాల రఘురాంశర్మ, రేఖ రమేశ్, ఎడెల్లి శివ, కొక్కు సునీల్, గంధసిరి కృష్ణ, ఉప్పల సతీశ్, రఘురాం, గుండ గాని స్టాలిన్, మహేశ్, నవీన్ పాల్గొన్నారు.