బతుకమ్మ.. తెలంగాణ ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ. సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అయిన పూలపండుగను సంబురంగా జరుపుకోవాలని కోరుకునే ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశను మిగిల్చింది. పండుగను వైభవంగా నిర్వహించుకునేందుకు గత కేసీఆర్ సర్కారు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు ఏటా 18 ఏళ్లు నిండిన వారందరికీ పండుగకు ముందే చీరెలు పంపిణీ చేస్తే రేవంత్ సర్కారు మాత్రం పండుగను చిన్నచూపు చూస్తోంది. ఇటీవల ఆరు జిల్లాలకే(ములుగు, మహబూబాబాద్ సహా) చీరెలను పరిమితం చేసి రెండు రోజులు హడావిడి చేసిన సర్కారు.. మంగళవారం నుంచి పంపిణీ నిలిపివేసి పండుగ తర్వాత ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. మిగతా 27 జిల్లాల మహిళల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి వెనుకడుగు వేసింది. అయితే పండుగ అయిపోయిన తర్వాత బతుకమ్మ చీరెలు ఇవ్వడం ఎందుకుని ఆడబిడ్డలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో చీరెలు మళ్లీ మూలనపడగా, అధికారులు సైతం పునరాలోచనలో పడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరెలు కరువయ్యాయి. పండుగ తర్వాత చీరెలను పంపిణీ చేస్తామని జీవోను జారీ చేయడంతో ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వస్తందని ప్రభుత్వానికి తెలియదా? పండుగ అయిపోయినంక ఇచ్చి ఎందుకని చీవాట్లు పెడుతున్నారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని ములుగు జిల్లాతో పాటు మరో ఐదు జిల్లాలకు చీరెల పంపిణీ చేపట్టగా ముచ్చటగా రెండు రోజులకే ఆగిపోయింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్న ఆడబిడ్డల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ ఆరు జిల్లాల్లో సైతం మొత్తానికే చీరెల పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ జీవోను విడుదల చేయడంతో గ్రామ పంచాయతీలకు చేరిన చీరెలు స్టోర్ రూమ్లలో మూలుగుతున్నాయి. అధికారులు సైతం చేసేదేమీ లేక వచ్చీపోయే మహిళలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. పండుగ అయిపోయిన తర్వాత 15వ తేదీ నుంచి చీరెల పంపిణీ ఉంటుందని వారికి సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు.
ఆడబిడ్డల ఆగ్రహం తప్పదని..
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల స్వయం సహాయక సంఘంలోని మహిళా సభ్యులకు, 18 ఏళ్లు నిండిన గిరిజన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 6న ములుగు, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల మహిళలకు ఇచ్చేందుకు రాష్ట్ర చేనేత సహకార సంఘం నుంచి చీరెలను సరఫరా చేసింది.
గత ప్రభుత్వ హయంలో ఎన్నికల సందర్భంగా పంపిణీ చేయకుండా చేనేత సహకార సంఘం వద్ద మిగిలి ఉన్న బతుకమ్మ చీరెలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలను, బతుకమ్మ చీరెల పేరును మార్చి తెలంగాణ ఆడపడుచుల చీరెల పంపిణీ పథకం పేరుతో సీఎం రేవంత్రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఫొటోలతో స్టిక్కర్లను అంటించి ప్యాకింగ్ చేసిన చీరెలు ఆయా జిల్లాలకు చేరాయి. ఈ నెల 7న మహిళా సంఘాల వీఓ గ్రూప్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు, గిరిజన ఆడబిడ్డలకు పంపిణీని ప్రారంభించారు.
గత ప్రభుత్వం ఇచ్చిన చీరెలే ఇప్పుడు ఇచ్చారని, వాటికి వీటికి తేడా లేదని, పేరు, ఫొటోలు మార్చి ఇవ్వడం ఏమిటని తీసుకున్న మహిళలు ఆవేదనతో వెళ్లినట్లు తెలిసింది. అందరికీ ఇవ్వకుండా కొందరికి ఈ మాత్రం ఎందుకు ఇవ్వాలని బాహాటంగానే అన్నట్లు సమాచారం. కేవలం ఆరు జిల్లాలోనే ఇస్తే రాష్ట్రంలోని మిగతా ఆడబిడ్డల నుంచి ఆగ్రహం తప్పదని ప్రభుత్వం భావించగా అప్పటికప్పుడు రాష్ట్ర చేనేత సహకార సంఘం ఎం.డీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులను జారీ చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు.
దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు చీరెల పంపిణీ నిలిపివేశారు. కాగా, ఉత్తర్వుల్లో బతుకమ్మ పండుగ తర్వాత ఈ నెల 15 నుంచి చీరెలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి అధికారుల అనాలోచిత చర్యలతో బతుకమ్మ పండుగకు ఎంపిక చేసిన ఆరు జిల్లాలోని మహిళలతో పాటు ఇతర జిల్లాలోని మహిళలకు తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైందని ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.