తొర్రూరు, జూన్ 8: సబ్సిడీ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించిన దందాతో తమకు ఎలాంటి సంబంధం లేదని సస్పెండ్ అయిన ఏఈవోలు తెలిపారు. తొర్రూరు మండలానికి కేటాయించిన పచ్చిరొట్ట జీలుగ విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించిన విషయంలో మండల వ్యవసాయ అధికారితో పాటు ముగ్గురు ఏఈవోలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సస్పెండ్ అయిన హరిపిరాల ఏఈవో సీహెచ్ అరవింద్, అమ్మాపురం ఏఈవో ఏ దీపిక, వెలికట్ట క్లస్టర్ ఏఈవో ఎం జమున శనివారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం తొర్రూరులో విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు.
తొర్రూరులోని రెండు ఆగ్రోస్ కేంద్రాలు, పీఏసీఎస్, సోమారపుకుంట తండా ఆగ్రోస్ కేంద్రానికి 500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించగా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, విత్తన విక్రయ కేంద్రం నుంచి కూడా క్లస్టర్ల వారీగా ఎలాంటి కేటాయింపు జరగలేదని తెలిపారు. మండల వ్యవసాయశాఖ అధికారి కుమార్‌యాదవ్ మే 22న ఉదయం వాట్సాప్ గ్రూప్‌లో విత్తన కేటాయింపుల గురించి వివరాలు పెట్టారన్నారు. ఈ సమాచారం అందించి విక్రయ కేంద్రం నుంచి కేటాయింపులు చేసేలోపే 50శాతం రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదయ్యాయని చెప్పారు.
ఏవో యూజర్ ఐడీ, పాస్వర్డ్ విక్రయ కేంద్రం వారికి ఇచ్చి వారి ద్వారా ఆన్లైన్లో పర్మిట్ జారీ చేశారని, విక్రయ కేంద్రం వారు వారికి తోచినవిధంగా రైతుల పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. తమ ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే రైతుల పేర్లలో పర్మిట్లు జారీ చేశారని, ఈ విషయాన్ని విచారణ అధికారి, మరిపెడ ఏడీఏ శోభన్‌బాబుకు పూర్తిగా వివరించామన్నారు. ఆయన ఇచ్చిన తప్పుడు నివేదికతో సస్పెండ్ చేయడం బాధాకరమని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉన్నతాధికారులు మరోసారి సమగ్ర దర్యాప్తు చేసి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు.