వ్యవసాయ యూనివర్సిటీ, మే 15: రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని, తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ మల్లారెడ్డి రైతులకు సూచించారు. రైతులు తమ సమీపంలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహా తీసుకొని సాగుకు ఉపక్రమించాలని చెప్పారు. సమతుల వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు బుధవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సదస్సు జరిగింది. మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు సూచనలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమతుల్య సాగు అవసరమని తెలిపారు.
నీటి సాంకేతికతకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు తీసుకోవాలని చెప్పారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కొనుక్కునేటప్పుడు అధికారులతో సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్హత గల డీలర్‌తో లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో కొనుగోలు చేయాలని చెప్పారు. తప్పనిసరిగా రసీదు పొంది పంట చివరి వరకు భద్రంగా దాచుకోవాలని సూచించారు. మూస పద్ధతిన సాగు చేస్తే అపార నష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు ప్రేమ్ సింగ్, శేఖర్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం సంచాలకులు అనిల్ ఉద్యాన పంటలు కూరగాయలు, పూల తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.