హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీ (స్వయం ప్రతిపత్తి) గ్రంథాలయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జనవరి 8, 9 తేదీలలో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ నావిగేటింగ్ ఛాలెంజెస్ అండ్ లావరేజింగ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై నిర్వహించే రెండురోజుల జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ.వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక డిజిటల్ యుగంలో గ్రంథాలయాల ఆధునీకరణ విద్యార్థి జ్ఞానసమపార్జనలో, మూర్తిమత్వ నిర్మాణంలో విడదీయరాని భాగమని తెలిపారు.
పింగిళి మహిళా కాలేజీ ‘అకడమిక్ లైబ్రరీలలో డిజిటల్ పరివర్తన: సవాళ్లను ఎదుర్కోవడం, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం’అంశంపై నిర్వహించబోయే జాతీయ సదస్సు విద్యార్థి, పరిశోధక విద్యార్థి, అధ్యాపక బృంద పరిశోధన ఆసక్తిని పెంపొందించే విధంగా, వినూత్న సమాచార సముపార్జనకు ఉపయోగపడే సూచనలు ఇచ్చేవిధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ బి.యుగంధర్, ఐక్యుఏసి కో-ఆర్డినేటర్ బి.సురేష్‌బాబు, సారంగపాణి, ఎస్.మధు, ప్రశాంతి, పి.రాజిరెడ్డి, రామరత్నమాల, ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.