ఖిలావరంగల్, మార్చి 4 : వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 148 దరఖాస్తులను అదనపు కలెక్టర్ సంధ్యారాణి స్వీకరించారు. ఇందులో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 114 మంది దరఖాస్తు చేసుకున్నారు. సంగెం మండలం కుంటపల్లికి చెందిన మానసి, శారీరక దివ్యాంగురాలైన ఎరుకల రజిత తమకు పింఛన్ ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఫిర్యాదు అందించింది.
రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన సత్తయ్య తన వ్యవసాయ భూమికి పక్కనే ఎంపీటీసీ బోరు వేసుకోవడం వల్ల సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాల్టా చట్టం ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. సంగెం మండలం కోట వెంకటాపురంలో నిజాం ఏలుబడిలో ఖాస్రా పహాణిలో తమ తాతలకు పట్టా చేసి ఇచ్చారని, ప్రస్తుతం ఆ భూమి కొందరు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు దరఖాస్తు చేసుకున్నారు. తన భర్త అహ్మద్ అలీ మృతి చెందాడని, ఆయన స్థానంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని అక్తర్‌బీ దరఖాస్తు చేసుకుంది. గ్రీవెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీవో కౌసల్యదేవి, అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, డీఆర్వో గణేశ్ విజ్ఞప్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 207 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి 147 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్‌కు సంబంధించి 19, ఆర్డీవోలకు సంబంధించి ఆరు, తహసీల్దార్లకు సంబంధించి 122, జీడబ్ల్యూఎంసీవి 9, డీఎంహెచ్వోవి 8, పోలీస్ కమిషనరేట్వి 6, కుడా ఆఫీసువి 5, విద్యాశాఖవి 4 దరఖాస్తులు ఉన్నాయి. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నీల రవీందర్, మాస్ సావిత్రి పాల్గొన్నారు.
వరంగల్ : కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు బల్దియా గ్రీవెన్స్‌లో అధికారులకు విన్నవించారు. బల్దియా గ్రీవెన్స్‌లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గీవెన్స్లో మొత్తం 76 వినతులు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి 40, ఇంజినీరింగ్ విభాగం 16, ప్రజారోగ్య విభాగం 6, పన్నుల విభాగం 14 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈ కృష్ణారావు, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్వో రాజేశ్, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్‌వో శంకరలింగం, హెచ్‌వో రమేశ్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, కృష్ణారెడ్డి, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.