వరంగల్, ఆగస్టు 21 : వరంగల్ తూర్పు నియోజకవర్గం (106) ఓటర్ల ముసాయిదా జాబితాను తూర్పు నియోజవర్గ రిటర్నింగ్ అధికారి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా విడుదల చేశారు. సోమవారం ఓటర్ల జాబితాను కార్పొరేషన్ నోటీస్ బోర్డుపై అంటించారు. జాబితా ప్రకారం 2,42,084 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,18,638, మహిళలు 1,23,211 మంది, 235 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారు. గతంలో 215 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఈ సారి 230 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు పరిధిలో వరంగల్, ఖిలావరంగల్ మండలాలు ఉన్నాయి. వరంగల్ పరిధిలో పురుష ఓటర్లు 60,982, మహిళా ఓటర్లు 62,295, ఒకరు ధర్డ్ జండర్, మొత్తం 1,23,278 మంది ఓటర్లు ఉన్నారు. ఖిలావరంగల్ పరిధిలో పురుష ఓటర్లు 57,656, మహిళలు 60,916, థర్డ్ జండర్లు 234 మొత్తం 1,28,806 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఓటర్ల చేర్పులు, తొలగింపు, సవరణలపై ఈ నెల 19వ తేదీలోపు తెలుపాలని ఎలక్ట్రోరల్ రిజిష్ర్టేషన్ అధికారి తెలిపారు. అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ కార్యాలయం, బూత్ లెవల్ అధికారులకు తెలియజేయాలన్నారు. పోస్ట్ ద్వారా అభ్యంతరాలు తెలియచేసే వారు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, 106 వరంగల్ తూర్పు నియోజకవర్గం, కమిషనర్ గ్రేటర్ కార్పొరేషన్, వరంగల్, 506002 అడ్రస్‌కు పంపించాలని తెలిపారు.
వరంగల్ పశ్చిమలో..
వరంగల్ పశ్చిమ నియోజవర్గం(105) ఓటర్ల ముసాయిదా జాబితాను అదనపు కమిషనర్ మహేందర్‌జీ విడుదల చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ నాయకుల సమక్షంలో ఆయన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో 2,72,163 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,35,278, మహిళా ఓటర్లు 1,36,855 మంది, థర్డ్ జండర్లు 10 మంది, ఎన్ఆర్ఐలు 78 మంది, సర్విస్ ఓటర్లు 71 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు.
పరకాల నియోజకవర్గంలో..
పరకాల నియోజకవర్గం (104)లో 2,11,660 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,03,981 మంది, మహిళలు 1,07,677 మంది ఉన్నారు. థర్డ్ జండర్లు 2, ఎన్ఆర్ఐ ఓటర్లు 3, సర్విస్ ఓటర్లు 152 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులపై సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. అక్టోబర్ 10వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.