నర్సింహులపేట : చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దాసరి వేణు అన్నారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగరం గ్రామంలో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. పెద్దనాగరంలో నిర్వహిస్తున్న సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర, తాహసిల్దార్ రమేశ్ బాబుతో కలిసి పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో ఇబ్బంది పడుతున్నవారు ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలన్నారు. వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని మండలాల రైతులు, ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అఖిల్‌తో పాటు అధికారుల బృందం పాల్గొన్నారు.