వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 27 : సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే అన్నారు. సోమవారం ఆమె గిర్మాజీపేట సీకేఎం హాస్పిటల్‌ను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. హాస్సిటల్లోని అన్ని విభాగాలను పరిశీలించి, మహిళలతో అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. పురిటి నొప్పులపై మహిళలకు ఉన్న భయాలను తొలగించడంతోపాటు ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. హాస్పిటల్ పరిసరాల శుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్ వివరాలను అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. 102 అమ్మ ఒడి వాహనం ద్వారా ఎంతమంది లబ్ధిపొందుతున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక నర్సుకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. సీకేఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ భారతి, పద్మ, నిర్మలాదేవి, ఆర్ఎంఓ శ్యాంకుమార్ ఉన్నారు.