భూపాలపల్లి రూరల్, మే 29 : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తన ఛాంబర్లో పౌర సరఫరాలు, జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాలలో నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు రవాణాను వేగవంతం చేయాలని, మిల్లర్లు ధాన్యం దిగుమతి కోసం హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ధాన్యం స్వీకరించినట్లు మిల్లర్లు ఇవ్వాల్సిన అంగీకార పత్రాలను వెంటనే అందజేయాలని, అధికారులు నిరంతరం మిల్లులను తనిఖీ చేస్తూ ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారును ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.