నల్లబెల్లి,జులై 11: వ్యవసాయంలో అన్నదాతలు సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఏడీఏ దామోదర్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రేలకుంట గ్రామంలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో వారి ఆధ్వర్యంలో డ్రోన్‌తో నానో యూరియా నానో డీఏపీ మందులు పిచికారి డెమో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు డ్రోన్ ద్వారా పిచికారి చేసి అధిక దిగుబడులు పొందాలన్నారు.
డ్రోన్ ద్వారా పంటకి కావాల్సిన మందు సమపాళ్లలో అందుతుందని, డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో నే తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలు పొందచ్చని చెప్పారు. ఇఫ్కో మార్కెటింగ్ ఆఫీసర్ విశాల్ షిండే మాట్లాడుతూ డ్రోన్ పని విధానం, డ్రోన్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్కువ ధరకే డ్రోన్ సర్వీస్ ని అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత బన్న, ఏఈఓ శ్రీకాంత్ ,ఇఫ్కో ప్రతినిధి జీవన్, ఎరువుల దుకాణాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.