ఐనవోలు, మార్చి 10 : నాయకులు వస్తారు.. పోతారని, కార్యకర్తలే శాశ్వతమని, వారే బీఆర్ఎస్కు బలమని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మండల స్థా యి కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ అధైర్య పడొద్దని, కార్యకర్తలను కంటి కి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. నియోజవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినా.. కొంతమంది వెన్నుపోటుదారుల వల్ల ఓడిపోయామని చెప్పారు. కొందరు పార్టీలు మారుతున్నారని, అంతమాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పదిమంది పోతే వందమంది కార్యకర్తలను తయారు చేయగలిగే సత్తా ఉన్న పార్టీ మన బీఆర్ఎస్ అన్నారు.
ఎంత మంది పార్టీని వీడి నా వేల సంఖ్యలో బీఆర్ఎస్ కోసం కష్టపడే కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్నారని గుర్తుచేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో సంపాదించిన తన స్థానాన్ని దూరం చేయలేరని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీ మోహన్, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ జయపాల్, మండల కోఆప్షన్ గుంషావలీ, అత్మ కమిటీ డైరెక్టర్లు పీ రాజు, ఎస్ రాజు, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు సోమేశ్వర్రావు, మండల ప్రచార కార్యదర్శి కోమలత, మండల నాయకుడు రాఘవులు, యూత్ అధ్యక్షుడు నరేశ్, నాయకులు సతీశ్, విక్రం, లక్ష్మణ్‌గౌడ్, భాస్కర్, శ్రీను, భిక్షపతి పాల్గొన్నారు.