ఖిలావరంగల్, డిసెంబర్ 30: వరంగల్‌ను నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సీపీ డాక్టర్ తరుణ్‌జోషి అన్నారు. ఓరుగల్లు కోటలోని ఖుష్‌మహల్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన వార్షిక నేర సమీక్షలో ఆయన వివరాలు వెల్లడించారు. వరంగల్ సీపీ పరిధిలో నేరాలకు పాల్పడిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హర్యాణకు చెందిన గ్యాంగ్‌లను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. 2020లో మొత్తం 10,622 కేసులు, 2021 డిసెంబర్ 15 నాటికి 11,047 కేసులు నమోదైనట్లు సీపీ చెప్పారు. గత ఏడాది కంటే 3.85 శాతం కేసులు పెరిగాయన్నారు. 5,456 కేసులు కోర్టుల ద్వారా పరిష్కరించామని, అందులో 2904 కేసుల్లో దోషులకు శిక్ష పడిందన్నారు. ఏడు కేసుల్లో ఐదుగురికి కోర్టు జీవిత ఖైదు విధించిందన్నారు. హనుమకొండ, మట్టెవాడ, నర్సంపేట, ఇంతెజార్గంజ్, కేయూసీ, మామునూరు, మడికొండ, సుబేదారి, ధర్మసాగర్, కాజీపేట, జనగామ డివిజన్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఏడు అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకుని రూ. 1,09,62,410 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ప్రధాన నేరాల వివరాలు
2020లో హత్య కేసులు 34 నమోదు కాగా, 2021లో 51 హత్య కేసులు నమోదయ్యాయి. ఇందులో 50 హత్య కేసులను గుర్తించామని సీపీ తెలిపారు. గత ఏడాది ఏడు దోపిడీ కేసులు నమోదు కాగా, 2021లో 26 నమోదైనట్లు వివరించారు. ఆస్తుల తగాదాలు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై హింస, కిడ్నాప్‌లు, లైంగిక దాడులు, వరకట్న చావులు, వేధింపుల కేసులు పెరిగాయని, అల్లర్లు, హత్యాయత్నాలు తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదాలు గతంలో 980 కాగా, ఈ ఏడాది 1,106 జరిగినట్లు తెలిపారు. ఇందులో 426 మంది మృత్యువాత పడగా, 1,110 మంది తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. 2020లో డ్రంక్అండ్డ్రైవ్లో 3,139 కేసులు నమోదు కాగా, 337 మంది జైలు శిక్ష అనుభవించారన్నారు. ఈ ఏడాది 11,980 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా, 1,365 మంది జైలుశిక్ష అనుభవించారన్నారు. వీరందరికీ కోర్డు రూ. 65,68,200 జరిమానా విధించిందన్నారు. 155 మాదక ద్రవ్యాల కేసులు నమోదు కాగా, 217 మందిని అరెస్టు చేసి రూ. 62,83,012 విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2020లో 51 మందిపై పీడీయాక్టు నమోదు చేయగా, 2021లో 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రమేయం ఉన్న 34,662 మందికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ద్వారా బాలకార్మికులు, వీధిబాలలు, యాచకులను రక్షించేందుకు సీడబ్ల్యూసీ ముందు 665 మంది పిల్లలను హాజరు పర్చామన్నారు. ఇందులో 53 మందిపై జేజే చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 1070 అదృశ్యం కేసులు నమోదు కాగా, 991 మందిని గుర్తించామని సీపీ చెప్పారు.
డయల్ 100కు స్పందన
డయల్ 100కు ఈ ఏడాది 68,910 మంది ఫోన్ చేశారని సీపీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 8 నిమిషాలకో కాల్, నగర పరిధిలో 6 నిమిషాలకో చొప్పున డయల్ 100కు ఫోన్ చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. 1,04,265 ఈ-పెట్టి కేసులు నమోదు కాగా, 7429 మంది దోషులుగా నిర్ధారించామన్నారు. కొవిడ్-19 కారణంగా కోర్డులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సన్నిహితకు ఈ ఏడాది 48,051 ఫిర్యాదుల వచ్చాయని, ఇందులో 47,142 పరిష్కారమయ్యాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందకుకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు షీటీమ్ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. వీరి పరిధిలో 22 ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 101 చిన్న కేసులు నమోదు చేశామన్నారు. 95 మందిని అరెస్టు చేసి, 110 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు.
సోషల్ మీడియా ద్వారా కేసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియా ద్వారా కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. 9491089257 నంబర్‌కు వాట్సాప్ ద్వారా వచ్చి 128 ఫిర్యాదులు, ట్విట్టర్ ద్వారా వచ్చిన 315 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఈ ఏడాది 19,941 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మొత్తంగా 35,418 సీసీ కెమెరాలు పని చేస్తున్నాయన్నారు. సైబర్ క్రైమ్‌లో ఈ ఏడాది 129 కేసులు నమోదు కాగా, 21 కేసులను గుర్తించి 17 మందిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ. 1.5 కోట్లు రికవరీ చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం ఈ ఏడాది గుట్కాలు విక్రయిస్తున్న 129 మందిపై కేసులు చేసి రూ. 1,03,21,691 విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు. పేక ఆడుతున్న 300 మందిపై 48 కేసులు నమోదు చేసి రూ. 12,75,130 స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. గంజాయిలో 118 మంది, పీడీఎస్ బియ్యం, కిరోసిన్‌లో 96 మంది, సైబర్ క్రైమ్‌లో 38 మంది, నకిలీ విత్తనాలు కేసులో 10 మందిపై కేసులు నమోదు చేసి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇంకా నకలీ కరెన్సీ, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, ఆన్లైన్ నాప్తోల్ మోసం, నకిలీ ఇన్సూరెన్స్, నకిలీ డాక్టర్, నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు.
కళా బృందాల అవగాహన
నేరాలు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ కళాజాత బృందాన్ని ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. ఈ ఏడాది 139 కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. వరంగల్ కమిషనరేట్‌కు నూతన భవన నిర్మాణం కోసం 2016లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించిందన్నారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయిందని, 2022లో భవన నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమీక్షలో ఈస్ట్, వెస్ట్ జోన్ల డీసీపీలు వెంకటలక్ష్మి, సీతారాం, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ సాయిచైతన్య, సెంట్రల్ ఇన్చార్జి డీసీపీ పుష్పారెడ్డి, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, భీంరావు, సంజీవ్ పాల్గొన్నారు.