హనుమకొండ : కమిషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, పోరాట వీరుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఏర్పాటు చేసిన కమిషన్ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో చేపట్టిన విచారణకు బుధవారం కేసీఆర్ హాజరు కాగా, ఆయనకు మద్దతుగా దాస్యం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లారు.
ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ తాగు, సాగునీటి తండ్లాటను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కనీసం ఒక పంటకు నీళ్లిచ్చిన పాపాన పోలేదని, కేసీఆర్ మూడేళ్లలో ప్రాజెక్టుల పునరుద్ధరణ, రీ డిజైన్లతో గోదావరి, కృష్ణా నదీ జలాలను ఒడిసిపట్టి పంట పొలాలకు తరలించారని కొనియాడారు. తెలంగాణకు సాగు, తాగు నీటి విషయంలో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌పై నిందలు మోపడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలతోనే కేసీఆర్‌ని ఇబ్బంది పెట్టాలని, తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ దార్శనికత, కార్యదక్షతతోనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగి దేశంలోనే తెలంగాణ అగ్ర భాగాన నిలిచిందన్నారు. తెలంగాణలో నీలి, హరిత విప్లవ సృష్టికర్త కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ కమిషన్లు కేసీఆర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ప్రజల హృదయాల్లో ఆయన సాగు, తాగునీటి అవసరాల కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. తరలిన వారిలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు బొద్దు వెంకన్న, జానకిరాములు, వెంకన్న తదితరులున్నారు.