వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపడతామని వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరాం నాయక్ అన్నారు. మంగళవారం మట్టెవాడ ఏసీపీ కార్యాలయంలో కాజీపేట, వరంగల్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్లు చిన్మయి చటర్జీ, శ్రీనివాస్ గౌడ్ ఏసీపీని మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా ఇరువురితో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ నిషేదిత ఉత్పత్తుల తరలింపు, మానవ అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందించాల్సిన సహకారం, తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరిపారు. రానున్న రోజుల్లో మానవ అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాల విషయంలో ఇరువర్గాల పోలీసు వ్యవస్థలు కలిసి పని చేసే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. నగరంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం సివిల్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్దంగావున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.