గార్ల, అక్టోబర్ 24: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుమ్మడి మహేశ్ (32) ఎంపీడీవో కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నెల 20న ఇంట్లో నోట్లోంచి రక్తం కారుతూ, తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడు తమ్ముడి ఫిర్యాదు మేరకు గార్ల పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టగా మృతుడి ఇంటిపక్కన ఉండే గంధసిరి కృష్ణ, అతడి భార్య మంజుల మహేశ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులిద్దరిని బయ్యారం సీఐ రవి కుమార్, గార్ల ఎస్సై జీనత్ కుమార్ విచారణ కోసం సీతంపేటకు తీసుకొచ్చారు.
మహేశ్ హత్యలో వీరిద్దరితోపాటు మరో ముగ్గురు ఉన్నారని, నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మూడు గంటలు పాటు గ్రామంలో ఉత్కంఠం నెలకొన్నది. చివరికి మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వచ్చి నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్పీ హామీతో మహేశ్ బంధువులు ఆందోళన విరమించారు.