పర్వతగిరి, ఆగస్టు2: పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న, డ్రైవర్ సదానందం అవినీతి శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 27న మండలంలోని అన్నారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై వెంకన్న పోలీసు సిబ్బంది తో కలిసి బెల్లం లోడ్‌ను పట్టుకుని సీజ్ చేశాడు. ట్రాలీ ఓనర్ భాస్కర్, డ్రైవర్ రాజేశ్, వర్కర్‌పై కేసు నమోదు చేసి కాలయాపన చేశాడు.
దీంతో భాస్కర్ స్నేహితుడు అజ్మీరా వెంకట్ ద్వారా ఎస్సైని అడుగగా కేసులో సహకరించాలంటే రూ. 70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ. 20 వేల ఫోన్ పే ద్వారా ఎస్సైకి పంపించాడు. మిగిలిన రూ. 50 వేలు తీసుకువస్తేనే కేసులో 41 నోటీసు ఇస్తానని, లేకుంటే జైలుకు పంపిస్తానని ఎస్సై వెంకన్న బెదిరించాడు.
దీంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని భాస్కర్ ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం డ్రైవర్ సదానందం ద్వారా రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై వెంకన్నతో పాటు డ్రైవర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు ఎల్ రాజు, ఎస్ రాజు, శ్యాంసుందర్, సిబ్బంది పాల్గొన్నారు.