హనుమకొండ , అక్టోబర్ 28: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్స్ఎదుట రోడ్డుపై పడుకోని నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతబూని మోకాళ్లపై నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు డిగ్రీ తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి సర్టిఫికెట్ ఎంత అవసరం కానీ కళాశాలల చుట్టూ తిరుగుతూ ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు గద్దెక్కినంక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఇకనైనా విద్యార్థులపై నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని వారు హెచ్చరించారు. వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్, శ్రీశాంత్, హరి కృష్ణ, శివ, కార్తీక్,నవీన్, రాహుల్, ట్రినిష్, అభియాన్ పాల్గొన్నారు.