జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 7 : సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం 13 మంది స్నేహితులతో కలిసి మేడారంకు వెళ్లిన జనగామ యువకుడు ఆదివారం ఉదయం జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని కురుమవాడ ఏరియాకు చెందిన కానుగంటి మనీశ్ (24)కు తండ్రి మరణించగా, తల్లి తారమ్మతో పాటు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ఏరియాలో ఉన్న ఓ కిరాణం అండ్ జనరల్ స్టోర్లో మనీశ్ పనిచేస్తున్నట్లు బంధు మిత్రులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు యువకుడు మనీశ్ జంపన్న వాగులో గల్లంతు కాగా సాయంత్రం 5 గంటలకు రెస్క్యూ టీమ్ మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనతో జనగామ జిల్లా కేంద్రంలో విషాదం అలుముకుంది.