హనుమకొండ, మే 13 : అందాల పోటీల అభ్యర్థులు బుధవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదతో పాటు వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆ ధ్వర్యంలో సుందరీమణుల పర్యటనకు పకడ్బందీ ఏ ర్పాట్లు చేశారు. వరంగల్ నగర వారసత్వం, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
నగరంలో పర్యటన వివరాలు..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:35 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5:45 గంటలకు వెయ్యి స్తంభాల ఆలయానికి చేరుకుని అకడి కార్యక్రమాల అనంతరం 6:25కు బయలుదేరి 6:40 గంటలకు వరంగల్ ఫోర్ట్‌కు చేరుకొంటారు. అనంతరం 7:35 గంటలకు బయలుదేరి రాత్రి 7:55 గంటలకు హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు డిన్నర్ చేసి, రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరుతారు. డిన్నర్లో గ్రిల్డ్ చికెన్, ఫిష్ బైట్, వెజ్ పన్నీర్ తదితర వంటకాలు వడ్డించనున్నారు.
సుందరీమణుల పర్యటనకు పోలీస్ బందోబస్తు..
సుబేదారి/హనుమకొండ చౌరస్తా: సుందరీమణుల బందోబస్తు ఏర్పాట్లపై హనుమకొండలోని సీపీ కార్యా లయంలో సీపీ సమావేశం నిర్వహించారు. వేయి స్తంభాల ఆలయం, ఖిలావరంగల్, హరిత హోటల్ వద్ద, వారు ప్రయాణించే మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్గురు డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 32 మంది ఇన్స్పెక్టర్లు, 81 మంది ఎస్సైలు, 155 మంది ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 325 మంది, మహిళా సిబ్బంది 106, హోంగార్డ్సు 210 మంది పాల్గొంటారని తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పాల్గొన్నారు.
అలాగే హరిత హోటల్ వద్ద సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. వేయిస్తంభాల ఆలయ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. గుడి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వారి వివరాలపై ఆరా తీశారు. హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్ పాల్గొన్నారు. అలాగే, వేయిస్తంభాల ఆలయాన్ని గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఉన్నారు. అందాలభామల పర్యటన నేపథ్యంలో నగర ప్రధాన రహదారులు విద్యుత్ దీపాల వెలుగుల్లో జిగేల్మంటున్నాయి. వెయ్యి స్తంభాల ఆలయంతో పాటు ఖిలా వరంగల్‌లోని కీర్తితోరణాలను అందంగా ముస్తాబు చేశారు.