వరంగల్, జూన్ 18: వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు. బీజేపీ కార్పొరేటర్లు, మరికొంత మంది అధికార కాంగ్రెస్ పార్టీ వారిని కలుపుకొని అవిశ్వాస తీర్మానం పెట్టాలనే పట్టుదలతో మంతనాలు సాగిస్తున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ చాంబర్లో రహస్య సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి మరుపల్ల రవి, దిడ్డి కుమారస్వామి, సిద్దం రాజు, కార్పొరేటర్ల భర్తలు బోగి సురేశ్, బస్వరాజ్ శ్రీమాన్, ఎండీ మసూద్, సుంకరి శివ, బీజేపీ కార్పొరేటర్లు దాస్యం అభినవ భాస్కర్, గుజ్జుల వసంత పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించే బడ్జెట్ సమావేశాన్ని సైతం అడ్డుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పాలక మండలిలో బీఆర్ఎస్కు 22 మంది కార్పొరేటర్లు ఉండగా, బీజేపీకి 10, కాంగ్రెస్‌కు 34 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వాలంటే 36 మంది కార్పొరేటర్లు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కలిసి వస్తేనే అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి ఉంటుంది. మొన్నటి వ రకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌లో చేరిన మేయర్‌కు చుక్కలు చూపెట్టాలన్న లక్ష్యం తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కార్యాచరణ చేస్తున్నారు.
మేయర్‌పై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లను పార్టీ ఎమ్మెల్యేలు కట్టడి చేసినట్లు విశ్వసనీయ స మాచారం. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజవర్గానికి చెందిన కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు నాయిని రా జేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, తూర్పులో సీనియర్ నా యకుడు నవీన్‌రాజ్ ఫోన్లు చేసి మందలించినట్లు తెలిసింది. దీంతో సమావేశానికి వారు గైర్హాజరయ్యారు.
ఈ నెల 20వ తేదీన జరిగే బల్దియా బడ్జెట్ సమావేశంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన బుధవారం పార్టీ కార్యాలయంలో చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశం, అవిశ్వాస తీర్మా నం లాంటి అంశాలపై మాట్లాడనున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు. దీంతోపాటు వర్షాకాలం వస్తున్న తరుణం లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి డివిజన్ల వారీగా ముంపు నివారణపై చర్చించాల్సిన అవసరం ఉందంటున్నారు.