భూపాలపల్లి రూరల్, నవంబర్ 5: దొంగిలించిన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా మంగళవారం ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జిల్లా పరిధిలో ఏప్రిల్ 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు దొంగిలించిన, పోగొట్టుకున్న 484 సెల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకొని, యజమానులకు అందజేశారు. సెల్ఫోన్లను గుర్తించి రికవరీ చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
వీరి ప్రశంసా పత్రాలను డీజీపీ భూపాలపల్లి జిల్లా సీఈఐఆర్ పోర్టల్ నోడల్ ఆఫీసర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ సెల్‌ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకు న్నా, దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ https:// www.ceir.gov.in నందు బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.