మామిడి విక్రయాల కోసం సరికొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఫ్రూటెక్స్ అనే కంపెనీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జాతీయ రహదారి పక్కన దీనిని ఏర్పాటుచేసింది. ఈ సంస్థ రైతుల నుంచి మామిడి కాయలను సేకరించడమే గాక ఇతర రాష్ర్టాల కొనుగోలుదారులను ఇక్కడికి పిలిపించి నేరుగా వేలం పాట ద్వారా క్రయవిక్రయాలు చేస్తోంది. లక్ష లోపు ఖరీదుకు కేవలం 5 నిమిషాల్లోనే, అంతకుమించితే కొన్ని గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమచేయడం, ట్రేడర్ కమీషన్ కూడా తక్కువ తీసుకోవడం, రవాణా ఖర్చు ఆదా అవుతుండడంతో ఎక్కువ మంది రైతులు ఈ మార్కెట్‌కు బారులు తీరుతున్నారు. రైతులకు దళారీ బెడద లేకుండా ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని నాణ్యత బట్టి గ్రేడింగ్ చేసి డిమాండ్ ఉన్న ఢిల్లీ, రాజస్థాన్, తదితర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుండగా, ఈ ఏడాది వెయ్యి టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ ఇన్చార్జి చెబుతున్నారు.
ఈసారి ప్రతికూల వాతావరణం కారణం గా మామిడి దిగుబడి తగ్గినప్పటికీ ఉన్నంతలో కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ము ఖ్యంగా హనుమకొండ, జనగామ, వరంగల్ హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ ఎత్తున తోటలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలోనే 5200 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా వీటి ద్వారా ఈసారి 10వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అంచ నా వేస్తోంది. ఈ మామిడి కాయలను రైతులు వరంగల్‌లో విక్రయించేందుకు తీసుకొస్తుంటారు. దీంతో నిత్యం మామిడికాయల లోడ్ తో భారీ ఎత్తున వాహనాలు బారులు తీరుతున్నాయి. అయితే వరంగల్ మార్కెట్‌కు వెళ్తే వేలం పాట తర్వాత రైతు వాహనం నుంచి కాయలను దిగుమతి చేసిన తర్వాత నాణ్యత పేరుతో ధరలను భారీగా తగ్గించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈక్రమంలో ఎల్కతుర్తిలో మార్కెట్ ఏర్పాటు కావడంతో ఎక్కువ మంది ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. నిన్న, మొన్నటివరకు వరంగల్ మార్కెట్లో మామిడికి తక్కువ ధర ఉండగా, ఈ ప్రూటెక్స్ మార్కెట్ ఏర్పాటైన తర్వాత భారీగా పెరిగిందని రైతులు సంతోషంగా చెప్తున్నారు.
ఫ్రూటెక్స్ మార్కెట్లో ఒక్కసారి వేలం పాట పూర్తయితే అదే ధరతో క్వాలిటీకి సంబంధం లేకుండా కాయలను దిగుమతి చేసుకుంటారు. అక్కడే ఉండే కూలీలు కాయ నాణ్యతను బట్టి ఏబీసీడీలుగా గ్రేడింగ్ చేసి సెపరేట్‌గా ప్యాకింగ్ చేస్తారు. పగిలిన కాయలను సైతం వేరుచేసి జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌ల తయారీ సంస్థలకు సరఫరా చేస్తారు. రైతు తన మామిడికాయల లోడ్ ఎప్పుడు పంపిస్తాడో సమాచారం ఇస్తే చాలు ఆ రైతు పేరిట స్లాట్‌ను బుక్ చేస్తారు. వాహనం చేరుకున్నది మొదలు దాని కాయ ధర, పేమెంట్ వివరాలను ఎప్పటికప్పుడు రైతు ఫోన్‌కు సమాచారం అందిస్తారు. నలుగురు ఐఐటీ విద్యార్థులు కలిసి నెలకొల్పిన ఈ ఫ్రూటెక్స్ సంస్థ కేవలం మామిడి కాయలే కాకుండా ఇతర పండ్లను కూడా సేకరించి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న రాష్ర్టాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఎల్కతుర్తిలో ఏర్పాటుచేసిన మార్కెట్ ద్వారా మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు మామిడి కాయల లోడింగ్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. ఈ ఏడాది ఎల్కతుర్తి మార్కెట్ ద్వారా వెయ్యి టన్నుల ఎగుమతి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కంపనీ ప్రతినిధులు చెప్తున్నారు. ఎల్కతుర్తి సమీపంలో ఉండే హసన్‌పర్తిలో మామిడికి సంబంధించి 50మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో కౌలు తీసుకొని మామిడి తోటలను సాగు చేస్తున్నారు. అక్కడినుంచి నేరుగా ఈ ఫ్రూటెక్స్ మార్కెట్లో విక్రయానికి తీసుకొస్తున్నారు.
రైతులకు మేలు చేయాలన్నదే మా కంపెనీ లక్ష్యం. అందుబాటులో మార్కెట్లను ఏర్పాటు చేసి మామిడి కాయలను సేకరించి వినియోగదారులకు కూడా కోతలు పూర్తయిన తక్కువ సమయంలో తాజాగా అందిస్తున్నాం. క్రయవిక్రయాలు అయిపోయిన తర్వాత గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుంది. మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
ఇక్కడ ఏర్పాటుచేసిన మామిడి కాయల విక్రయాల మార్కెట్ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా కాయలు అమ్ముకోవడం సులభమవుతుంది. మాకు రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. నా మామిడి తోటలో నుంచి కూలీల ద్వారా మామిడి కాయలను కోయించి డైరెక్టుగా తీసుకొచ్చాను. వేలం పాట కూడా పూర్తయింది. ఇదివరకు గంటల తరబడి మార్కెట్లో వేలం పాట కోసం ఎదురుచూడాల్సి వచ్చేది.
ఇక్కడ మార్కెట్ పెట్టినప్పటి నుంచి రోజూ 50 మంది కూలీలకు పని దొరుకుతోంది. మాకు గంటకు రూ.100 చొప్పున కట్టిస్తున్నారు. మార్కెట్ అయిపోయేదాకా మమ్మల్ని రోజూ రమ్మని చెప్పారు. ప్రస్తుతం పనులు లేని సమయంలో ఎల్కతుర్తికి మార్కెట్ రావడం సంతోషంగా ఉంది. నాలుగైదు గ్రామాల యువకులకు ఇక్కడ మూడు షిప్టులుగా పనికి వస్తున్నాం. ఈ కంపెనీ వారు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు.