తాడ్వాయి, ఏప్రిల్ 13 : బయ్యక్కపేట అడవుల్లో నాలుగు రోజులుగా పులి సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం ముసలమ్మపెంట గొత్తికోయగూడేనికి చెందిన రైతు సత్తయ్య ఆవు మేతకు వెళ్లగా దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్పటినుంచి పులి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.
ప్రస్తుతం పులి బయ్యక్కపేట అడవుల్లోనే ఉన్నట్లు గుర్తించారు. దాని జాడ కనుగొనేందుకు ఐదు చోట్ల కెమెరా ట్రాప్లు అమర్చారు. పులికి ఎవరూ హాని తలపెట్టవద్దని బయ్యక్కపేట, గొత్తికోయగూడెం సహా పరిసర గ్రామాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, నష్టం జరిగితే అటవీ శాఖ ద్వారా పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు.
ఈ నెల 11న ఆవుపై దాడి చేసిన పులి జాడ మళ్లీ కనిపించకపోవడం, ఇతర జిల్లాల అడవులకు వెళ్లిన ఆనవాళ్లు లేకపోవడంతో బయ్యక్కపేట అడవుల్లోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పులి జాడ కోసం అన్వేషిస్తున్నామని, ప్రజలు దాడికి గురికాకుండా అప్రమత్తం చేస్తున్నామని అధికారులు చెప్పారు.