హనుమకొండ, జూలై 12 : రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు విషయంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగ ల్ జిల్లాలో హత్యలు, మానభంగాలు, పోలీస్ వేధింపులు అధికమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో హోంశాఖకు మంత్రి లేకపోవడం దురుదృష్టకరమన్నారు. శాంతి భధ్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే యువత పెడదారి పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తండాలో జరిగిన గిరిజన తల్లిదండ్రుల హత్యోదంతం దారుణమని, ఈ విషయంలో పోలీసు అధికారులు సరిగా స్పదించలేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ నెల 16న సీఎం కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై సమీక్షించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నుంచి జిల్లాలో ఇద్దరు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలుండగా, 11వ నంబర్ ఎమ్మెల్యే కడియం శ్రీహ రి ప్రవర్తన వేరుగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రూ.1600 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చామని, ఈ ఏడు నెలల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి ప్రగతిలో ఉన్న పనులను ఆపివేయడంతో పాటు టెండర్ కాని వాటిని రద్దు చేస్తున్నారని పెద్ది ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను వేధించడం, వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం, కాంగ్రెస్‌లోకి లాకోవడంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం పాలనను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తొర్రూరులో జరిగిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎకడ జరిగినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా మూకుమ్మడిగా అకడికి వెళ్తామన్నారు. అలాగే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రశ్నిస్తూ తిరుగబాటు చేస్తామని పెద్ది పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదని పెద్ది ఆరోపించారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, ఆస్పత్రుల పరిస్థితి అధ్వానంగా ఉందని, డెంగీ లాంటి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో లేని సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇక నుంచి అధికార పార్టీ ఇచ్చిన హామీలపై రోజుకొక పోస్టు సోషల్ మీడియాలో పెడతామని, ఇందుకోసం శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. అలాగే ప్రతి హామీపై ప్రశ్నిస్తామని, ఎంత మందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో చూస్తామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో రౌడీ షీటర్స్ నగరానికి దూరంగా ఉంటే.. నేడు వారు ఖద్దరు చొకా లతో తిరుగుతున్నారని, ఇదే వరంగల్‌లో వచ్చిన మార్పు అన్నారు. కేసీఆర్ కుటుంబంతోనే బీఆర్ఎస్ అవినీతిమయంగా మారిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారని, అదే నిజమైతే కడియం శ్రీహరి కూడా అందులో భాగమైనట్లు ఒప్పుకున్నట్లే కదా అని అన్నారు. జీవితంలో కాంగ్రెస్‌కు ఓటు వేయన్న శ్రీహరి, మొన్నటి ఎంపీ ఎన్నికల్లో సైతం తన బిడ్డకు ఓటు వేయనట్లు ఉన్నాడని చెప్పారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజల తరపున కొట్లాడుతామని, కేసులను ఎదుర్కొంటామని సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు, బోయినపల్లి రంజిత్‌రావు, మైనార్టీ నాయకుడు నయీముద్దీన్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, మిట్టపల్లి రమేశ్, బైరపాక ప్రశాంత్ పాల్గొన్నారు.