నల్లబెల్లి, ఆగస్టు 11: అటు వరుణుడు కరుణించకపాయె.. ఇటు ప్రభుత్వమైనా కనికరిస్తుందంటే అదీ లేకపాయె.. దీంతో సాగునీటి కోసం రైతన్న అల్లాడుతున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలతోపాటు బావు లు, బోర్లపై ఆధారపడిన అన్నదాతలు వరి నార్లు పోశారు. గత 15 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో, కాల్వల్లో నీరు వదలకపోవడంతో నార్లు ముదురుపోతున్నాయి.
పొలాల్లో కలియదున్నేందుకు నాటిన జీలుగ, పెసరు లాంటి చేల్లు ఏపుగా పెరిగాయి. వర్షాలు సమృద్ధిగా పడితే నల్లబెల్లి మండలంలో 13,500 ఎకరాల్లో వరి సాగయ్యేది.. కానీ ఇప్పటి వర కు 6,500 ఎకరాల్లో సాగు చేశారు. రంగాయచెర్వు ద్వారా గోదావరి జలాలను వదిలితే డీబీఎం-38 ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా పంటకు సాగు నీరందేది.రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇకనైనా సర్కారు స్పందించి రంగాయచెర్వుకు గోదావరి జలాలు, ఎస్సారెస్పీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.