నర్సింహులపేట మే 14 : మండల కేంద్రంలోని కపిలగిరి గుట్టపై వేంచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మి- ఆదిలక్ష్మి కళ్యాణం సందర్భంగా బుధవారం బండ్లు తిరిగే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసు బందోబస్తు లేకపోవడంతో ఫలహారం బండ వద్ద ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు చుట్టూ తిరిగే క్రమంలో గొడవకు దారి తీసింది. క్యూ పద్ధతి పాటించకపోవడంతో ట్రాక్టర్లను చూసిన ఎడ్లు బెదిరిపోయాయి. దీంతో ఒక ఎద్దు మూర్చతో పడిపోయింది.
ఎదురుగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు రావడంతో భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన నరసింహస్వామి దేవస్థానం వద్ద ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ ఉంటారు. ఏడాది జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించకపోవడంతో గొడవలు చోటుచేసుకున్నాయని వివిధ గ్రామాలను భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.