హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 31 రాష్ట్ర రహదారుల విస్తరణ, ఆధునికీకరణ కోసం కేంద్రం గురువారం రూ.850 కోట్లు మంజూరు చేసింది. వీటితో 31 రహదారులను 435.29 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. జిల్లాలవారీగా సుమారు 31 సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్లుగా మారుస్తారు. పలుచోట్ల వంతెనలు నిర్మిస్తారు. మహబూబాబాద్ జిల్లా గిరిపురం-రాంపురం రోడ్డు, కురవి-ఇల్లందు క్రాస్‌రోడ్డు, వరంగల్ జిల్లా చెన్నారావుపేట-మాచాపూర్ వయా ఉప్పరపల్లి,
పల్లారిగూడ, ఆరేపల్లి-పరకాల, భూపాలపల్లిలో భుజ్నూర్-గుమ్మదేవ్పల్లె, హనుమకొండలో పరకాల-నార్లాపూర్, వర్ధన్నపేటలో పీడబ్ల్యూడీ రోడ్డు-శ్రీనగర్ వయా కొనకపాక, జగన్ తండా-లైబ్రరీ రోడ్డు, కట్య్రాల-కొత్తపల్లి, ఇల్లంద-పర్వతగిరి వయా రామ్ధానితండా, వర్ధన్నపేట-కొక్కిరాలపల్లి, మురిపిరాల-జఫర్‌గఢ్, హనుమకొండ జిల్లాలోని ముదికొండ-మామునూరు, పెద్దపెండ్యాల-పున్నేల్, దర్గా-గుంటుపల్లి రోడ్డును డబుల్‌లేన్‌గా మారుస్తారు. డోర్నకల్‌లో ఆకేరు వాగుపై ఉల్లేపల్లి, మాధవపురం-మన్నెగూడెం మధ్య వంతెన నిర్మిస్తారు.