ఊరూ.. వాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడి త్రివర్ణ శోభితమైంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
హనుమకొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ ప్రావీణ్య జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ ఝాతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. వరంగల్ ఖుష్మహల్ మైదానంలో కలెక్టర్ సత్యశారద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో కలెక్టర్ టీఎస్ దివాకర, మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో షేక్ రిజ్వాన్ బాషా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మైదానంలో రాహుల్ శర్మ జాతీయ జెండాలను ఎగురవేశారు.
ఆయా జిల్లాల్లో అమ లవుతున్న సంక్షేమ, అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. జాతీయ సమైక్యత వెల్లివిరిసేలా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
– నమస్తే నెట్వర్క్, జనవరి 26