దూరం నుంచి చూస్తే మామూలు గుట్టల్లా కనిపిస్తున్నా.. నిజానికి అవి ‘చెత్త’గుట్టలు. వరంగ ల్ నగరంలోని రాంపూర్ డంపింగ్ యార్డు పరిస్థితి ఇదీ. రోజురోజుకూ పెరుగుతున్న చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నది. డంపింగ్ యార్డులో 3.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు మూడేళ్ల క్రితం బల్దియా చేపట్టిన బయోమైనింగ్ ప్రక్రియ కొన‘సాగు’తూనే ఉంది. దీంతో పాటు అప్పటి నుంచి కొత్తగా డంపింగ్ యార్డుకు సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి చేరడంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. హైదరాబాద్ తరహాలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. పాలకులు, అధికారుల్లో చి(చె)త్తశుద్ధి లేకపోవడంతో నగరానికి చెత్త సమస్య సవాల్ విసురుతున్నది.
– వరంగల్, డిసెంబర్ 8
రాంపూర్ డంపింగ్ యార్డులో పేరుకుపోతున్న చెత్తను తగ్గించేందుకు మూడేళ్ల క్రితం బల్దియా చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ సక్సెస్ కాలేదు. 3.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ చేసే ప్రక్రియ మూడేళ్లుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ పూర్తి కాలేదు. అప్పటి నుంచి కొత్తగా తరలిస్తున్న చెత్త ఇప్పటికే సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. రోజూ సుమారు 450 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్న నగరంలో చెత్తశుద్ధి చేసేందుకు బల్దియా పాలకులు, అధికారులు ఆలోచనలు చేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. మహా నగరాల్లో అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసే దిశలో ముందడుగు వేయడం లేదు.
డంపింగ్ యార్డులో చెత్తను తొలగించేందుకు చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ సక్సెస్ కాలేదు. 3.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిన్నర కాలంలో శుద్ధి చేయాలని టెండర్ ఇచ్చారు. ఇప్పటికే మూడేళ్లుగా సాగుతున్న సుమారు 3లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే శుద్ధి చేశారు. టెండర్ గడువు ముగిసి ఏడాది కాలం అయినప్పటికీ వారికి కేటాయించిన లక్ష్యం చేరుకోలేదు. ఇంకా 75 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేయాల్సి ఉంది. వరంగల్ మహా నగరానికి బయో మెనింగ్ విధానం సరైనది కాదని అధికారులే అభిప్రాయ పడుతున్నారు.
రాంపూర్‌లోని బల్దియా డంపింగ్ యార్డులో బయోమైనింగ్‌కు కేటాయించిన చెత్త కాకుండా కొత్తగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త శుద్ధికి మూడేళ్లు పడితే కొత్తగా వచ్చి చేరుతున్న చెత్తకు ఇంకెన్నేళ్లు పట్టాలన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. నగరంలో చెత్త ఉత్పత్తి అనేది నిరంతర ప్రక్రియ. దానిని నియంత్రించ డం సాధ్యం కాదు. డంపింగ్ యార్డుకు చేరిన చెత్తను తొందరగా శుద్ధి చేయడం బల్దియా చేయాల్సిన పని. అయితే పాలకుల నిర్లక్ష్యంతో పెరుగుతున్న చెత్తగుట్టలతో ఏ రోజు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
గతంలో నగరాభివృద్ధిపై హైదరాబాద్‌లో జరిగిన సమీక్షల్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌పై చర్చించారు. అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 800 కోట్లు ఖర్చవుతున్నదని అంచనా వేశారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉండాలన్న సూచనలతో అధికారు లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల మధ్యన 30 ఎకరాల స్థలం సేకరించి రెండు నగరాలకు కలిపి వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదు. చెత్త సమస్యకు సత్వర పరిష్కార మార్గాలు అన్వేషించకుంటే భవిష్యత్‌లో పరిస్థితులు జఠిలం కానున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.