నమస్తేతెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 29 : అభయ హస్తం గ్యారెంటీలకు దరఖాస్తు కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రజలు దరఖాస్తులు అందజేశారు. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో 50,258 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం గ్యారెంటీల కోసం 31,960, ఇతర సమస్యలపై 3008 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 35,771 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ జిల్లాలో ఒక్క రోజు 38,295 దరఖాస్తులు వచ్చా యి. కాగా, పలు చోట్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. గ్రేటర్ 8వ డివిజన్ గుడిబండల్ వద్ద, 6వ డివిజన్లో కుమారపల్లి మారెట్ వాటర్ ట్యాంక్ వద్ద, 7వ డివిజన్‌కు సంబంధించి పబ్లిక్‌గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సభలను ప్రారంభించారు.
అలాగే, గీసుగొండ మండలంలోని రాంపురం, శాయంపేట, చంద్రయ్యపల్లి, హర్జ్యాతండా గ్రామాల్లో ప్రజాపాలన సభలు నిర్వహించగా రాంపురం సభకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. అంతేకాకుండా ఖానాపురం మండలం దబీర్పేటలో జరిగిన సభలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నా రు. అనంతరం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు. అలాగే, నర్సంపేట మండలం చిన్నగురిజాల, భాంజీపేటలో ఎమ్మెల్యే దొంతి పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలం బండౌతాపురంలో జరిగిన సభలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. అలాగే, హసన్‌పర్తి మండలం సీతంపేటలో పాల్గొని మాట్లాడారు. అలాగే, రెండు జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రజాపాలన సభలను నిర్వహించి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.