జయశంకర్ భూపాలపల్లి, మే 30 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు జిల్లా ప్రజలకు ఆయుష్ వైద్యం అందని ద్రాక్ష లా మారింది. జిల్లాకు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆ యుష్ ఆస్పత్రిని మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభు త్వం భవనాన్ని సైతం నిర్మించింది. అయితే కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఓపీ సేవలు ప్రారంభం కాలేదు. కనీసం వైద్య పరికరాలు, ఫర్నీచర్ కూడా తీసుకురాలేకపోగా, ఈ భవనాన్ని యథేచ్ఛగా న ర్సింగ్ కళాశాలకు అప్పగించడంతో తరగతులు కొనసాగుతున్నాయి.
ఉన్నతాధికారులు సైతం ఈ విషయమై పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో రెండేళ్లుగా నేచర్ క్యూర్ (పంచకర్మ), యునాని, హోమియోపతి, ఆయుర్వేద వైద్య సేవలు ప్రారంభం కాలే దు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ఈ సేవల కోసం రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం వరంగల్‌లో మాత్రమే 150 పడకల అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ హాస్పిటల్ (వైద్య కళాశాలకు అనుబంధం) అందుబాటులో ఉండగా ప్రజలు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆస్పత్రులు లేవు. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ ప్రభు త్వం భూపాలపల్లి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలకు ఆయుష్ ఆస్పత్రులను మంజూరు చేయించింది. భూపాలపల్లిలో రూ. 10 కోట్లతో భవన నిర్మాణాన్ని సైతం పూర్తి చేయించింది.
జిల్లా కేంద్రంలో నిర్మించిన ఆయుష్ భవనాన్ని నర్సింగ్ కళాశాలకే అప్పగిస్తారా? సేవలను అటకెక్కిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నర్సింగ్ కళాశాల నుంచి ఆయుష్కు భవనాన్ని అప్పగిస్తే వైద్య సేవలు ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయుష్ హాస్పిటల్‌కు ఎన్ఆర్హెచ్ఎం నుంచి డిప్యూటేషన్‌పై వైద్యులు అలాట్ అయ్యారు. ఫర్నీచర్, మెడిసిన్, స్టాఫ్ రావాల్సి ఉంది.
ఓపీ ప్రారంభమైతే ప్రజలకు ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలో 8 ఆయుష్ డిస్పెన్సరీలుండగా ఇందులో మూడు ఆయుర్వేదిక్, రెండు హోమియోపతి, మూడు యునాని ఉన్నాయి. దామెరకుంట, చల్లగరిగ, మొగుళ్లపల్లి డిస్పెన్షరీలకు మాత్రమే రెగ్యులర్ డాక్టర్లున్నారు. ధర్మారావుపేటలో ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ ఆఫీసర్ వారానికి మూడు రోజులు (గురు, శుక్ర, శని) వైద్య సేవలందిస్తున్నారు. కొడవటంచలో మెడికల్ ఆఫీసర్ రిటైర్ కావడంతో అక్కడ మళ్లీ నియామకం జరగలేదు. వల్లెంకుంటలో భవనం లేక సేవలు అందడం లేదు. మహదేవ్‌పూర్‌లో వైద్యుడు డిప్యుటేషన్‌పై వైద్య సేవలందిస్తుండగా, మహాముత్తారంలో డాక్టర్లు లేరు.
భూపాలపల్లిలో నిర్మించిన 50 పడకల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభించాలని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఈ వైద్యం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ భవనం ఇంకా మాకు అప్పగించలేదు. ఎన్ఆర్హెచ్ఎం నుంచి డిప్యుటేషన్‌పై వైద్యులను కేటాయించారు. మెడిసిన్, స్టాఫ్, ఫర్నీచర్ రావాల్సి ఉంది. మొన్ననే 8 చైర్లు వచ్చాయి. పరికరాలు, ఫర్నీచర్, ఇతర సామగ్రి కోసం ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం. మా భవనంలోని పై రెండు అంతస్తుల్లో నర్సింగ్ కళాశాల కొనసాగుతుండగా, గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉంది .
– డాక్టర్ లీ చంద్ర. ఆయుష్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్