కమలాపూర్, నవంబర్ 7 : కమలాపూర్ మండలంలో ధాన్యం కొనుగోలులో రైస్‌మిల్లర్లు కోత పెడుతూ రైతులను గోసపెడుతున్నారు. మిల్లర్లు చెప్పినట్లు వినాలంటూ వ్యవసాయాధికారులు హుకుం జారీ చేస్తున్నారు. 40 కిలోల బస్తాకు 2 కిలోలు కోత పెడుతుండడంతో క్వింటాలు ధాన్యానికి ఐదు కిలోలు కోత పడుతుందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రశ్నించిన రైతును ధాన్యం బాగాలేదు నీ ఇష్టం ఉన్నచోట అమ్ముకొమ్మని రైస్‌మిల్లర్ రిజెక్ట్ చేస్తున్నాడని వాపోతున్నారు.
40 కిలోల బస్తాకు కిలో మాత్రమే తరుగు తీయాలని సివిల్ సప్లయ్ అధికారులు నిర్ణయిస్తే రైస్‌మిల్లర్లు మాత్రం 2 కిలోలు కోత పెడుతున్నా రు. ఓ రైతు 139 క్వింటాళ్ల 44 కిలోల ధాన్యం తేగా, 2 కిలోలు కోత పెడితే 6 క్వింటాళ్ల 64 కిలోలు కోతపెట్టారు. సన్నరకానికి ప్రభుత్వం బోనస్ పేరుతో తేమశాతం, ప్యాడీ క్లీనర్‌తో తాలుపట్టడం వంటి నిబంధనలు పెట్టడంతో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. 40 కిలోల బస్తాకు కిలో మాత్రమే తరుగు తీయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మండలంలోని 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మూడు రైస్‌మిల్లులకు కేటాయించారు. రైస్‌మిల్లర్లు అధికారులు నిర్ణయించిన కిలో కాకుండా 2కిలోలు కోత పెడుతుండడంతో క్వింటా ధాన్యానికి 5కిలోలు పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం దాన్యం ఎంపిక చేయడంలో వ్యవసాయాధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు రైతులు వాపోయారు. ఈ విషయమై సివిల్ సప్లయ్ డీటీ రమేశ్‌ను వివరణ కోరగా కిలోమాత్రమే తరుగు తీయాలని మిల్లర్లను ఆదేశించినట్లు చెప్పారు.