ములుగు, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ) : మూగ జీవాలకు సేవలందిస్తున్న 1962 ఉద్యోగులకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 36 మందికి ఏడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. పాడి సంపద పరిరక్షణ కోసం 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం సంచార పశు వైద్య సేవలను 1962 అంబులెన్స్‌ల ద్వారా చేపట్టింది. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లి, జనగామ, పరకాల, పాలకుర్తి, నర్సంపేట, వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ ప్రాంతాలకు తొమ్మిది అంబులెన్స్‌లను కేటాయించింది.
వీటిల్లో పనిచేసేందుకు ఒక పశు వైద్య నిపుణుడు, ఒక పారవెట్, హెల్పర్, క్యాప్టన్ను ఉద్యోగులుగా నియమించింది. పశువైద్యులకు రూ.35వేలు, ప్యారవెట్కు రూ.14,500, క్యాప్టన్కు రూ.9,800, హెల్పర్‌కు రూ.8,500 చొప్పున ప్రతి నెల జీవీకే సంస్థ ద్వారా వేతనాలు అందిస్తున్నారు. వీరంతా 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ రాగానే గ్రామా ల్లో పర్యటిస్తూ మూగజీవాలు, పశువులకు వైద్య సేవలందిస్తున్నారు. దీంతో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందడంతో గ్రామాల్లో పశు మరణాలు తగ్గుముఖం పట్టడంతో పాటు రైతులకు, పశు యజమానులకు మేలు చేకూరినట్లయింది.
జీతాల కోసం ఎదురుచూపులు
రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖకు సరైన నిధులు కేటాయించకపోవడంతో ఏడు నెలలుగా ఉమ్మడి జిల్లాలో తొమ్మిది 1962 అంబులెన్స్‌లలో పనిచేస్తున్న 36 మంది ఉద్యోగులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందుల సరఫరా కూడా చేపట్టకపోవడంతో ఉన్నవాటితోనే పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ వాహనాల బాధ్యతలను చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఇటు సిబ్బందికి వేతనాలు అందక, అటు మందుల సరఫరా లేక వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంబులెన్స్‌ల బలోపేతానికి నిధు లు విడుదల చేసి వేతనాలు అందించడంతో పాటు మందుల కొరతను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.