ఒకటి నుంచి ప్రారంభానికి బడులు సిద్ధం
జిల్లాలో 1,025 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు
విద్యార్థుల సంఖ్య 1,26,049
768 ప్రభుత్వ స్కూళ్లలో శానిటేషన్ పనులు
పరిసరాలు, తరగతి, వంట గదులు, టాయిలెట్లు శుభ్రం
పాఠశాలల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ..పరిశుభ్రతపై తనిఖీలు
సిద్ధం చేసినట్లు నేడు ధ్రువీకరించనున్న అధికారులు
వరంగల్, ఆగస్టు 29(నమస్తేతెలంగాణ) : పునః ప్రారంభానికి పాఠశాలలు రెడీ అవుతున్నాయి. గ్రామ పంచాయతీ, మున్సిపల్, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి, వంట గదులు, టాయిలెట్స్, పరిసరాలను ఇప్పటికే శుభ్రం చేశారు. మూడు రోజుల నుంచి సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శానిటైజ్ చేస్తుండగా, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనల అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పాఠశాలలోనూ తాగునీరు, విద్యుత్ సరఫరా, టాయిలెట్లు తదితర మౌలిక వసతులు సమకూర్చుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఎం హరిత జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతితో సమావేశమై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రారంభంపై చర్చించారు. ఈమేరకు పాఠశాలలను సిద్ధం చేసే బాధ్యతలను వివిధ శాఖల జిల్లా అధికారులకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సందర్శించి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు.
కరోనాతో మూతపడిన పాఠశాలలను తిరిగి సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో నాలుగైదు రోజుల నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక గ్రామ పంచాయతీ, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో మున్సిపల్, వరంగల్లోని సర్కారు పాఠశాలల్లో జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పరిసరాలను, తరగతి, వంట గదులతో పాటు టాయిలెట్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు. స్కూళ్ల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. శుక్రవారం నుంచి శానిటేషన్ చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి, విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు.
పర్యవేక్షణ.. పరిశీలన..
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పనులను అదన పు కలెక్టర్ హరిసింగ్, డీఈవో వాసంతి, జడ్పీ సీఈవో రాజారావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, ఎం పీడీవోలు, మండల విద్యాధికారు(ఎంఈవో)లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ హరిసింగ్ ఆదివారం వరంగల్ మట్టెవాడలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారంలోగా ప్రతి తరగతి గదిని శానిటైజ్ చేయాలని, చెత్తను తొలగించాలని, మరుగుదొడ్లు శుభ్రం గా ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్ హరిత వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి పరిశుభ్రత పనులను పరిశీలించారు. ప్రారంభంలోగా ప్రతి పాఠశాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రారంభంపై జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి జిల్లా పరిషత్ కార్యాలయంలో గత శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రారంభానికి ఒకరోజు ముందే ప్రతి పాఠశాలను సిద్ధం చేయాలని సూచించారు. జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి శనివారం వరంగల్ మట్టెవాడలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశుభ్రతను పరిశీలించారు. బుధవారం ప్రారంభం కానున్నందున మంగళవారం ప్రభుత్వ పాఠశాలల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయాలని జీడబ్ల్యూఎంసీ సిబ్బందిని ఆదేశించారు.
పరిశుభ్రతపై నేడు ధ్రువీకరణ..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 1,025 ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 257. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ 722 ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు జిల్లాలో ఒక నవోదయ, 9 గిరిజన సంక్షేమశాఖ స్కూళ్లు, 3 ఆశ్రమ పాఠశాలలు, 16 రెసిడెన్సియల్ స్కూళ్లు, 16 మదర్సాలు, ఒక యూఆర్ఎస్ ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1,26,049 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ ఎయిడెడ్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోనే 45,811 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 70,824. మరికొంత విద్యార్థులు నవోదయ, ప్రభుత్వ రెసిడెన్సియల్స్, మదర్సాలు, యూఆర్ఎస్లో చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ 1,26,049 మంది విద్యార్థుల్లో ఉన్నత పాఠశాలల విద్యార్థుల సంఖ్య 93,415 ఉండడం గమనార్హం. కాగా, సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి పాఠశాలలో పరిసరాలు, తరగతి గదులు, వంట గది, టాయిలెట్ల పరిశుభ్రత, శానిటేషన్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ, ప్రత్యక్ష తరగతుల నిర్వహణ కోసం సిద్ధం చేయడంపై సోమవారం ఆయా పాఠశాల ప్రదానోపాధ్యాయుడు, స్థానిక ఎంఈవో, ఎంపీడీవో ధ్రువీకరణతో కూడిన నివేదికలను కలెక్టర్కు పంపాల్సి ఉంది.