రూ.179 కోట్లు.. 409 పనులు..
ఇప్పటికే పూర్తయిన 259 అభివృద్ధి పనులు
చివరి దశలో మరో 31
అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవ
రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాల నిర్మాణం
వీధి దీపాలు, అవసరమున్న చోట కొత్త స్తంభాల ఏర్పాటు
వరంగల్, ఆగస్టు 29: పట్టణ ప్రగతి ద్వారా నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రభుత్వం ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ. 7.34 కోట్లు విడుదల చేస్తూ ప్రగతికి బాటలు వేస్తున్నది. ఇప్పటికే నగరంలోని 145 దళిత బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు రూ. 133 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన పట్టణ ప్రగతిలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుకు సాగుతున్నారు. 409 అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేసిన అధికారులు రెండు నెలల కాలంలో సగం పనులు పూర్తి చేశారు. పట్టణ ప్రగతి ద్వారా విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అంతర్గత సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేశారు. 66 డివిజన్లలో వీధి దీపాలు, అవసరమున్న చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. లేబర్‌కాలనీ, టేకులగూడెం ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ టాయిలెట్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా చెత్త తరలింపు కోసం వాహనాలు, ఎక్స్కవేటర్లు, స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేశారు. కొత్త కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు కొన్నింటి మరమ్మతు పనులు పురోగతిలో ఉన్నాయి. తాగునీటి సరఫరాను మెరుగు పరుస్తున్నారు. సెంట్రల్ లైబ్రరీ, రీజినల్ లైబ్రరీ గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా విడుదల చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో నగరంలోని అన్ని డివిజన్ల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు..
గ్రేటర్ వరంగల్ పరిధిలో పట్టణ ప్రగతి నిధులు రూ. 179.34 కోట్లతో అధికారులు అభివృద్ధి పనుల పూర్తికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రూ. 106.44 కోట్లతో 259 అభివృద్ధి పనులు పూర్తి చేశారు. రూ. 14.83 కోట్లతో చేపట్టిన 31 పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ. 58 కోట్లతో చేపట్టాల్సిన 119 అభివృద్ధి పనులను టెండర్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వందల కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో నగరంలోని ప్రధాన రహదారుల పనులు వేగంగా సాగుతుండగా పట్టణ ప్రగతి నిధులతో కాలనీల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండడంతో ప్రజలు సంబురపడుతున్నారు.