పోడు సాగుదారులకు హక్కు పత్రాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అర్హులకు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాటికి మించి నకిలీ పట్టాలు బయటపడుతున్నాయి. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో సుమారు మూడు వేల నకిలీ హక్కు పత్రాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నకిలీ పట్టాల దందాతో గత ప్రభుత్వం హయాంలో ఒరిజినల్ పట్టాలు పొందిన రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వమంటున్నారు. నకిలీ ఏదో, అసలు పట్టాలు ఏవో తెలియక ఇటు బ్యాంకు, అటు అటవీ, పోలీస్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
– ములుగు, అక్టోబర్ 25 (నమసే ్తతెలంగాణ)
కొందరు గిరిజనేతరులు అత్యాశకు పోయి మధ్యవర్తులకు ఎకరానికి రూ.10వేలు, నాలుగు ఎకరాలకు రూ.40వేల చొప్పున చెల్లించి నకిలీ పట్టాలు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొనసాగిన ఈ దందాను ఆదిలోనే తుంచివేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. సదరు ముఠా ప్రజలను రైతు భరోసా పేరుతో నమ్మ బలికి ఈ పట్టాలను అందజేశారు. గత ప్రభుత్వం పోడు సాగుదారులకు అందించిన హక్కు పత్రాలతో ప్రస్తుతం వారందరికీ రైతు బంధు పథకంతో పాటు పంట రుణాలు సకాలంలో అందుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న ముఠా సభ్యులు గ్రామాల్లో ఏజెంట్ వ్యవస్థను స్థాపించుకొని ఎకరానికి రూ.10 వేల చొప్పున వసూలు చేసి నకిలీ పట్టాలను తయారుచేసి అందించారు.
భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియనప్పటికీ పట్టాలను మాత్రం పుచ్చుకున్నారు. గిరిజనేతరులు పోడు పట్టాలు తీసుకొని బ్యాంకుల వద్దకు రుణాల కోసం రావడంతో అధికారులు గుర్తించడంతో గుట్టురట్టయ్యింది. మరికొందరు బ్యాంకు అధికారులు మధ్యవర్తులు ఇచ్చే ముడుపులకు ఆశపడి రుణాలను మంజూరు చేశారు. రెవెన్యూ పోర్టల్లో అటవీ పట్టా లు చూపించక పోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ వివరాలు ఐటీడీఏల పరిధిలో లిస్ట్ రూపంలో ఉండగా, నకిలీ పట్టాలు ప్రజల చేతులు మారడంతో ప్రస్తుతం పోడు పట్టాలను బ్యాంకు అధికారులు నమ్మడం లేదు.
అటవీ హక్కుల చట్టం 2006 కింద గత ప్రభుత్వ హయంలో పోడు పట్టాలను పంపిణీ చేసి జిల్లా కలెక్టరేట్ల నుంచి పంట రుణాలను అందించే అన్ని బ్యాంకులకు రైతుల వివరాలను పంపించారు. ఇంతకాలం దీని ఆధారంగా బ్యాంకర్లు రుణాలను అందించారు. గత యాసంగితో పాటు ప్రస్తుత వానకాలంలో కొందరు రైతులకు రుణాలను పంపిణీ చేయగా గ్రామాల్లో ఇంకా చాలా మంది రుణాలు పొందాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ జరగడంతో కొత్త రుణాలు పొందినట్లయితే భవిష్యత్లో మాఫీ అవుతాయనే ఆశతో పోడు సాగుదారులు ప్రభుత్వం అందించిన పట్టాలను తీసుకెళ్లి రుణాలను మంజూరు చేయాలని కోరారు.
నకిలీ పట్టాల వ్యవహారం బయటపడడంతో బ్యాంకు అధికారులు అసలు పట్టాదారులకు కూడా రుణాలను అందించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో అసలైన లబ్ధిదారులకు నకిలీ పట్టాలు శాపంగా మారాయి. అసలుకు ఏ మాత్రం తీసిపోని విధంగా తయారు చేసిన నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించడంలో అధికారులు, బ్యాంకర్లకు తలనొప్పి వ్యవహారంగా మారింది. కాగా, అధికారులు అసలు, నకిలీ పట్టాలను కనిపెట్టడంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 3వేల హక్కు పత్రాలను ఎప్పుడు రికవరీ చేస్తారనేది ప్రశ్నార్థంగా మారింది. దీంతో పాటు దందాకు తెర లెపిన ముఠాలో ఐదుగురిని ములుగు జిల్లాలో అరెస్టు చూపగా దీని వెనుక సూత్రధారులు, పాత్రధారుల కథను ఎప్పుడు ముగిస్తారో వేచిచూడాల్సి ఉంది.