గిర్మాజీపేట, మార్చి 14 : జిల్లా వ్యాప్తంగా మంగళవారం వరకు 2,44,278 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 37,939 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 24,153 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చామన్నారు. జిల్లాలో 129 గ్రామ పంచాయతీలు, 36 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయని, మరో 26 జీపీలు, 18 వార్డుల్లో త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. 1,82,186 మందికి కంటి సమస్యలు లేవని డీఎంహెచ్‌వో చెప్పారు.
పోచమ్మమైదాన్‌లో..
పోచమ్మమైదాన్ : కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు వెలుగునిస్తున్నదని 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్‌కుమార్ జోషి అన్నారు. దేశాయిపేటలోని మహిళా సమాఖ్య భవన్లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో దేశాయిపేట అర్బన్ హల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్, సూపర్వైజర్ జన్ను కొర్నేలు, శానిటరీ ఇన్స్పెక్టర్ ధరంసింగ్, ఎల్లస్వామి పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట రూరల్ : మండలంలోని దాసరిపల్లి, ఇప్పల్ తండాలో కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. శిబిరాలను సర్పంచ్‌లు పెండ్యాల శ్రీనివాస్, భూక్యా సుజాత పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమాల్లో వైద్యాధికారులు కల్యాణి, సరోజ పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని ముంజాలకుంట తండా, మూడెత్తుల తండా, ఇస్లావత్ తండాల్లో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 15 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయినట్లు వైద్య బృందం తెలిపింది. కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంతి, రమేశ్, నవీన్, బిందు, డాటా ఎంట్రీ ఆపరేటర్ ప్రవళిక బృందం తదితరులు సేవలందిస్తున్నారు.