‘నాడు వచ్చీరాని కరెంట్‌తో గోసపడ్డం. సమైక్య పాలనలో అరకొర విద్యుత్‌తో ఆగమైనం. చేను వద్ద కునుకు తీస్తేనే మడి పారేది. విష పురుగుల బారిన పడేటోళ్లం. పనుల్లేక చిరు వ్యాపారులు విలవిలలాడిన్రు. కేసీఆర్ సార్ వచ్చినంక 24 గంటల కరెంటిచ్చుడుతోటి సంబురంగున్నం. రాష్ట్రం వచ్చినంక నిరంతర విద్యుత్ సరఫరాతో రైతులు పంటలు బాగా పండించుకొని లాభపడ్డరు. చిన్న వ్యాపారులు, దుకాణాదారులు, మెకానిక్‌లకు మంచిగ పని దొరికింది. తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయన్న నాయకులకు దిమ్మ తిరిగేలా పెద్దాయన సమాధానం చెప్పిండు. ఇంత చేసిన కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. కాంగ్రెస్ రాకతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నయి’ అని వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఏటూరునాగారం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కరెంట్ సరిగా లేక గోసపడ్డం. ఏ రాత్రి వస్తదో తెలియదు. అది రాగానే పొలం దగ్గరకు పరుగు పెట్టేది. ఎప్పటి వరకు ఉంటదో తెలియక పోయేది. మిర్చి తోటలు సాలు తడవక ముందే కరెంట్ పోయేది. ఏం చేయాలో తెలియక, పంటను ఎండబెట్టుకోలేక సతమతమయ్యేది. ఆయిలింజన్లతో నీరు పారించినా తడి లేక పంట దిగుబడి రాకపోయేది. 2014 తర్వాత కేసీఆర్ 24 గంటలు కరెంటివ్వడంతో ఊపిరి పీల్చుకున్నం. పంటలు మంచిగ పండినయ్. కంటిరెప్ప పాటు కూడా కరెంట్ పోలేదు.
వర్ధన్నపేట: కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రంల 24 గంటల పాటు కరెంట్ ఇచ్చిండు. ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో విద్యుత్ వ్యవస్థ మెరుగు పడింది. ఎవుసానికి ఉచితంగ 24 గంటల కరెంటియ్యడం వల్లే రైతులు పంటలు బాగా పండించుకొని లాభపడ్డరు. గ్రామాల్లో కూడా చిన్నచిన్న వ్యాపారులు, దుకాణాదారులు, మెకానిక్‌లకు మంచిగ పని దొరికింది. ఇంత చేసిన కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయిండు. కాంగ్రెస్ సర్కారు వచ్చినంక రాష్ట్రం రాకముందున్న కరెంట్ సమస్యలు మళ్ల వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
దంతాలపల్లి: సమైక్య పాలనలో ఉన్న విద్యుత్ ఇబ్బందులను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చింది. 2014కు ముందు రాత్రి పూటే సాగుకు కరెంట్ ఇవ్వడం తో చేను వద్ద కునుకు తీస్తేనే మడి పారేది. చాలా మంది రైతులు పాములు, ఇతర విష పురుగుల కాటుకు చనిపోయారు. కేసీఆర్ వచ్చినంక 24 గంటల విద్యుత్‌ను అందించిండు. రైతులకు ఉచితంగా నిరంతర సరఫరా చేయడంతో వలస వెళ్లిన రైతులు తిరిగి స్వగ్రామాలకు వచ్చి ఎవుసాన్ని పండుగలా చేసుకున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరున్నర నెలల్లోనే విద్యుత్ ఇబ్బందులు తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వానికి సాధ్యమైన కరెంట్.. కాంగ్రెస్ సర్కారుకు ఎందుకు కావడం లేదు. ఆయన చేపట్టిన సంస్కరణలపై కాంగ్రెస్ మాట్లాడడం అర్థరహితం.