గీసుగొండ, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని అనంతారం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించి, రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. అనంతరం కొమ్మాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొమ్మాల, విశ్వనాథపురం, నందానాయక్తండా, సూర్యతండా, దస్రుతండా గ్రామాల రైతులకు పంటనష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులు రెండు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎటు చూసినా పచ్చని పొలాలు కనబడుతున్నాయని, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నారు. రైతులు పచ్చగా ఉండడం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన ఇబ్బందులను గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు.
ఏనాడైన పంటలు నష్టపోతే అప్పుడు పరిహారం అందించారా? అని ప్రశ్నించారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 3 గంటల కరెంటు చాలు అంటున్నాడన్నారు. అలాంటి వారు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తోందన్నారు. దేశంలో కల్యాణలక్ష్మీ పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్థికసాయం అందించేది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. రైతులకు సమయానికి విత్తనాలు అందిస్తూ ఎరువులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో రైతు రాజు అవుతున్నాడన్నారు. వలస పోయిన వారు తిరిగి గ్రామాలకు వస్తున్నట్లు తెలిపారు. ధరణి తీసేస్తే రైతులు మళ్లీ గోస పడుతారన్నా రు. భూమి పత్రాల కోసం తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. మండలంలో రైతులు తమ ధాన్యం నిల్వ చేసుకునేందుకు గొర్రెకుంటలో నూతనంగా గోదాం నిర్మించినట్లు తెలిపారు. అవసరమైతే మండల పరిధిలో మరో గోదాం నిర్మించుకుందామన్నారు.
మొగిలిచెర్ల అభివృద్ధి బాధ్యత నాదే
గ్రేటర్ 15వ డివిజన్ మొగిలిచెర్ల అభివృద్ధి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రామంలో రూ3కోట్లతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు పంట నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విలీన గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చొరవతో విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తునట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, వైస్ ఎంపీపీ రడం శ్రావ్యా భరత్, ఏవో హరిప్రసాద్‌బాబు, సర్పంచ్‌లు మక్కెన అశ్విని, వీరాటి కవిత, అంకతి నాగేశ్వర్రావు, వాంకుడోత్ రజిత, కేలోత్ సరోజన, బాదావత్ అమ్మి,కొమ్మాల ఎంపీటీసీ వాంకుడోత్ గోపాల్, కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ వీరాటి లింగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి వేణుగోపాల్, ఊకల్ సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు జూలూరి లెనిన్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, గుగులోత్ రాజు, కుమారస్వామి, గజ్జి రాజు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, చిన్న, రమేశ్, పూండ్రు జైపాల్‌రెడ్డి, ప్రకాశ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.