శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Aug 10, 2020 , 01:01:05

యాంటీ కరోనా స్పెషల్‌ చాయ్

యాంటీ కరోనా స్పెషల్‌ చాయ్

రెడ్డికాలనీ: కొవిడ్‌-19 నివారణకు ప్రజలు వంటింటి చిట్కాలకు ప్రాధాన్యమిస్తున్నారు. కరోనా భయంతో జనజీవన శైలిలో మార్పులు వచ్చాయి. సంప్రదాయ పద్ధతిలో ఇంటి వైద్యం మీదనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. పోపుల పెట్టెలోని దినుసులతో కషాయం తయారు చేసుకొని సేవిస్తు న్నారు. వైరస్‌ ప్రబలిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇలా చిట్కాలు పాటిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కషాయం ఎంతగానో దోహదపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో దీనిపై విస్తృత ప్రచారం జరుగుతుండడంతో ఆదరణ పెరుగుతోంది. కొవిడ్‌-19 నేపథ్యంలో హోటళ్లు వెలవెలబోతుండడంతో యజమానులూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజల నాడి తెలిసిన వారు వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. అల్లం, బెల్లం, శొంఠి, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ తదితర పదార్థాలతో చేసిన యాంటీ కరోనా చాయ్‌ను విక్రయిస్తున్నారు. గిరాకీ బాగుంటుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆసక్తి చూపిస్తున్న ప్రజలు..

కరోనా నివారణకు కావాల్సిన పదార్థాలతో చాయ్‌ చేస్తుండడంతో అటువైపు నుంచి వెళ్లేవారు టేస్ట్‌ చేయకుండా వెళ్లడంలేదు. వేడివేడి కరోనా టీ తాగుతూ కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద మనకు కరోనా చాయ్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి.  

స్పెషల్‌ చాయ్‌లో ఇవీ..

యాంటీ కరోనా స్పెషల్‌ చాయ్‌ తయారీకి అల్లం, బెల్లం, పచ్చకర్పూరం, శొంఠి, ఓమ, జీలకర్ర, యాలకులు, ఉప్పు, లవంగం, పుదీనా, మిరియాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ రసాన్ని వినియోగిస్తున్నారు. 

కప్పుకు రూ.10 నుంచి రూ.15 వరకు తీసుకుంటున్నారు. రోజూ పలు కూడళ్లలోని హోటళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముతున్నారు.